కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి... 8వ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమైన ఏడు రోజులలో మొత్తం 5 లక్షల 42 వేల 57 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో సమకూరినట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు. వైకుంఠ ద్వార దర్శనాలు మొదలైనప్పటి నుంచి ఏడు రోజుల్లో మొత్తం రూ. 28 కోట్ల 69 లక్షల హుండీ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు టీటీడీ అధికారులు.
రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతోండటంతో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోందని... ప్రత్యేక క్యూ లైన్లు, టైమ్ స్లాట్ దర్శనాలు, భద్రతా ఏర్పాట్లతో రద్దీని సమర్థంగా నియంత్రిస్తున్నామని తెలిపారు టీటీడీ అధికారులు.
భక్తులకు విస్తృత సౌకర్యాలు
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల సంఖ్య అధికంగా ఉన్న క్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి.అన్నప్రసాదాలు తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశామని... వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే భక్తులకు ప్రత్యేక సహాయ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు కూడా క్రమబద్ధంగా కొనసాగుతున్నాయని తెలిపారు వెంకయ్య చౌదరి.
వైకుంఠ ద్వారా దర్శనం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు ఎంతో శ్రద్ధతో తిరుమలకు తరలివస్తున్నారని... శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు తమ అనుభూతులను ఆనందంగా వ్యక్తం చేస్తున్నారని అన్నారు. లక్షలాది మంది భక్తుల దర్శనం, కోట్ల రూపాయల హుండీ ఆదాయం తిరుమల శ్రీవారి మహిమను మరోసారి చాటుతున్నాయని... రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని అన్నారు వెంకయ్య చౌదరి.
