వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..మాతంగి వేషధారణలో ఎంపీ

వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..మాతంగి వేషధారణలో ఎంపీ

తిరుపతి  గంగమ్మ జాతర కన్నుల పండవుగా కొనసాగుతోంది. మొత్తం 8 రోజుల పాటు నిర్వహించే  జాతరలో ఐదో రోజు (మే 14వ తేదీ) ఆదివారం మాతంగి రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి  "మాతంగి" వేషధారణలో అమ్మవారికి మొక్కును చెల్లించుకున్నారు. ఎంపీ గురుమూర్తితో పాటు..గంగమ్మకు మంత్రి ఆర్కే రోజా దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి రోజా సారెతో ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరితో పాటు..చిన్నా పెద్దా తేడా లేకుండా పురుషులు మాతంగి  వేషధారణలో తమ మొక్కులు చెల్లించుకున్నారు. 

తెలంగాణలో బతుకమ్మ పండుగలు, సమ్మక్కసారక్క జాతర, బోనాల పండగలాగే తిరుపతిలో గంగమ్మ జాతర(తాతగట్టు గంగమ్మ జాతర) ఎంతో సుప్రసిద్ధమైంది.ఈ జాతరకు తిరుపతి నుంచే కాకుండా రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏడాది మే నెలలో గంగమ్మ తల్లి జాతర జరుగుతుంది. మొత్తం 8 రోజుల పాటు జాతరను భక్తులు జరుపుకొంటారు. మే నెల మొదటి మంగళవారంలో జాతర ప్రారంభమై...రెండవ మంగళవారంతో జాతర ముగుస్తుంది. మొదటి మంగళవారం అర్థరాత్రి దాటాకా...కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమంతో జాతర మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో గంగమ్మ జాతరను అక్కడి  ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించింది.

తిరుపతి పట్టణంలో ఏడుగురు గ్రామదేవతలు ఉన్నారు. అంకాళమ్మ, మాతమ్మ, ఉప్పంగి మారెమ్మ, తాళ్ళపాక పెద గంగమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, తాతగట్టు గంగమ్మ అమ్మవార్లు కొలువు తీరారు. అయితే భక్తులు  గంగమ్మ జాతరనే వైభవంగా నిర్వహిస్తారు. జాతరలో భాగంగా అమ్మవారికి  కైంకర్యాలు, జాతర ఉత్సవాలు ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహిస్తారు. ఇక తాతగట్టు గంగమ్మ అమ్మవారిని శ్రీ వేంకటేశ్వరుని చెల్లెగా భావిస్తారు. గంగమ్మ జాతరలో భాగంగా ప్రతీ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం వారు అమ్మవారికి పట్టు చీర సమర్పిస్తారు. ఈ జాతరకు ఏపీ నుంచే కాకుడా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. గంగమ్మ తల్లికి భక్తులు పసుపు, కుంకుమ, చీరెలు, పొంగళ్ళు సమర్పించి కోరికలు కోరుకుంటారు.