- రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్కు మద్దతు: కోదండరాం
- ఘనంగా టీజేఎస్ 8వ ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాజకీయ వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చామని తెలంగాణ జన సమితి రాష్ట్ర చీఫ్ కోదండరాం అన్నారు. ఎన్నికల్లో విఫలమైనా ప్రజల్లో ఉన్నామని పేర్కొన్నారు. టీజేఎస్ 8వ ఆవిర్భావ వేడుకలు బుధవారం హైదరాబాద్ పార్టీ ఆఫీస్లో ఘనంగా జరిగాయి. కోదండ రాం మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లుగా జనం పక్షాన నిలబడి పోరాటం చేస్తూ నిలదొక్కుకున్న పార్టీగా టీజేఎస్ ఎదిగిందన్నారు.
రాష్ట్రంలో టీజేఎస్లేని ప్రజా పోరాటం ఏదీ లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కావాలనే ఆశ తమకు లేదన్నారు. ప్రజలకు అవసరమైనప్పుడు అండగా ఉండడమే తమ బాధ్యత అన్నారు. డబ్బు కేంద్రంగా మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూడా ప్రజా సమస్యలపై గొంతెత్తిన పార్టీగా జన సమితి ప్రత్యేకతను చాటుకుందన్నారు. మే 12న పార్టీ ప్లీనరీ నిర్వహించి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో టీజేఎస్వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

