కృష్ణాజలాల సాధన కోసం 10న నిరసన దీక్ష : కోదండరాం

కృష్ణాజలాల సాధన కోసం 10న నిరసన దీక్ష : కోదండరాం

కృష్ణా జలాల సాధన కోసం జనవరి 10న నిరసన దీక్ష చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. ఈ నెల 20న ‘ధరణి’ పోర్టల్​ సమస్యలపై సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ అవినీతిని ఎండగడుతామని చెప్పారు. కేసీఆర్కు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజల బాధలు పట్టవని కోదండరాం అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై  ఆందోళనలు చేస్తే అరెస్టులు చేయించే కేసీఆర్​.. ఢిల్లీకి వెళ్లి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. జనవరి 30న ఢిల్లీలో సెమినార్, 31న విభజన హామీల అమలును కోరుతూ ఆందోళన చేస్తామని కోదండరాం ప్రకటించారు. విభజన హామీల అమలును కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు.  

టీఆర్​ఎస్​, బీఆర్​ఎస్​ గా మారిపోయి ఎటుపోవాలో అర్థంకాక కొట్టుమిట్టాడుతోందని చెప్పారు. 119 అసెంబ్లీ స్థానాలే తమ లక్ష్యమని కోదండరాం స్పష్టం చేశారు. గత తొమ్మిదేళ్లలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం అడ్డగోలుగా  దోచుకుందని.. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష ఇంకా నెరవేరలేదని తెలిపారు. లిక్కర్ వ్యాపారంతో కేసీఆర్​ కూతురు కవితకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల నిధులను సైతం కేసీఆర్​ సర్కారు కొల్లగొట్టిందని ఆరోపించారు. ‘‘సెంటు చుక్క వాసన వచ్చే వాడు కాదు.. చెమట చుక్క కార్చేవారే మా అభ్యర్థి”అని కోదండరాం తేల్చి చెప్పారు. ‘‘తెలంగాణ ఉద్యమకారులమంతా ఈ రోజు సమావేశం అయ్యాం. అందరం ఏకమై తెలంగాణవాదాన్ని రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. త్యాగాల పునాదిపై ఏర్పడిన పార్టీలోని తెలంగాణ అనే పదాన్ని బీఆర్​ఎస్​ తొలగించింది. తద్వారా ఉద్యమ అమరులను, తెలంగాణ వాదాన్ని అవహేళన చేసింది”అని ఆయన మండిపడ్డారు.