ఇవాళ్టి నుంచే చెన్నై కోల్ కతా మధ్య తొలి మ్యాచ్

ఇవాళ్టి నుంచే చెన్నై కోల్ కతా మధ్య తొలి మ్యాచ్
  • తొలి మ్యాచ్‌‌లో చెన్నైతో కోల్‌‌కతా ఢీ
  • నేటి నుంచే ఐపీఎల్15వ సీజన్
  • బరిలో పది జట్లు.. 74  మ్యాచ్‌‌లు
  • రెండు నెలలు ఫ్యాన్స్ కు మజా

ఇండియాలో క్రికెట్‌‌ ఫీవర్‌‌ మొదలైంది. ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్‌‌ జాతర మళ్లొచ్చింది. మెగా లీగ్‌‌ 15వ సీజన్‌‌ ఇయ్యాల్నే షురూ అవుతోంది. మొత్తం 10 టీమ్స్ 65 రోజుల పాటు ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. రెండు కొత్త టీమ్స్ తో పాటు కొత్త ఫార్మాట్, మెగావేలంలో ప్రతి టీమ్ కొత్త ప్లేయర్లను తీసుకోవడంతో ఈసారి లీగ్ మరింత ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్‌‌లో  డిఫెండింగ్ చాంపియన్‌‌ చెన్నై సూపర్ కింగ్స్ -కోల్​కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి.

కోట్లాది మంది ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న  క్రికెట్‌‌ జాతర మళ్లొచ్చింది..! 14 ఏళ్లుగా వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్‌‌ జాతర ఈసారి ‘పదింతల’ మజాను అందించనుంది..!  మొన్నటిదాకా ఎనిమిది జట్ల మధ్య హంగామా.. ఇప్పుడు పది టీమ్స్‌‌ మధ్య ఫైట్‌‌గా మారింది..! అన్ని జట్ల రూపురేఖలు మారాయి..!  కొత్త కెప్టెన్లు వచ్చారు.. కొత్త రూల్స్‌‌ వచ్చాయి!  ఆడే రోజులు.. మ్యాచ్‌‌ల సంఖ్య పెరిగింది.!  మొత్తంగా పది జట్లు గ్రౌండ్​లో తమ దమ్ము చూపించేందుకు 
రెడీ అయ్యాయి..!

మరి,  హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఆరో టైటిల్‌‌తో సిక్సర్‌‌ కొడుతుందా... పోయినేడాది విన్నర్‌‌ చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌ ఐదో ట్రోఫీతో ముంబైని మ్యాచ్‌‌ చేస్తుందా.. సీఎస్‌‌కే కెప్టెన్సీ వదులుకున్న లెజెండ్​ ధోనీ  బ్యాటుతో మునుపటిలా దంచికొడతాడా..  గత ఫైనల్లో బోల్తా కొట్టిన కేకేఆర్​  శ్రేయస్‌‌ అయ్యర్‌‌ కెప్టెన్సీలో ‘మూడో’ ముచ్చట తీర్చుకుంటుందా..కెప్టెన్‌‌గా ఆర్‌‌సీబీని విజేతగా నిలపలేకపోయిన కింగ్‌‌ కోహ్లీ ప్లేయర్‌‌గా అయినా కప్పును అందుకుంటాడా...  కొత్త జట్లు లక్నో, గుజరాత్‌‌ తొలిసారే హిట్‌‌ అవుతాయా...కొన్నేళ్లుగా చివరి స్థానాల కోసం పోటీ పడుతున్న  రాజస్తాన్‌‌ రాయల్స్‌‌, పంజాబ్‌‌ కింగ్స్‌‌, సన్‌‌ రైజర్స్‌‌ హైదరాబాద్‌‌  ఈసారైనా ముందు వరుసలోకి వస్తాయా.. మొదటిసారి కెప్టెన్సీ అందుకున్న హార్దిక్‌‌ పాండ్యా, జడేజా, డుప్లెసిస్‌‌, మయాంక్‌‌ మెప్పిస్తారా..!  ఎవరేం చేసినా.. ఈ రెండు నెలలూ ఫ్యాన్స్​కు కిక్కే కిక్కు..!

ముంబై: రెండు గ్రూప్‌‌లు.. పది జట్లు.. 65 రోజులు.. 74 మ్యాచ్‌‌లు..! క్రికెట్‌‌ అభిమానులను ఉర్రూతలూగించేందు ఐపీఎల్‌‌ 15వ సీజన్‌‌ ముస్తాబైంది. కరోనా వల్ల 2020లో అరబ్‌‌ గడ్డపై మజాను పంచి.. పోయినేడాది రెండు విడతల్లో కిక్‌‌ ఇచ్చిన మెగా లీగ్‌‌ రెండేళ్ల తర్వాత ఇండియా అభిమానుల సమక్షంలో సందడి చేయనుంది.  డిఫెండింగ్​ చాంప్​ చెన్నై సూపర్ కింగ్స్, గత రన్నరప్ కోల్ కతా నైట్ నైడర్స్ మధ్య శనివారం జరిగే తొలి మ్యాచ్​తో ఈసీజన్​కు తెరలేవనుంది.   నిరుడు కరోనా కారణంగా లీగ్ అర్ధాంతరంగా వాయిదా పడటం నుంచి పాఠాలు నేర్చుకున్న బోర్డు ఈసారి బయోబబుల్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిపేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. ట్రావెలింగ్, ప్లేయర్ల భద్రత దృష్టిలో పెట్టుకుని కేవలం ముంబై, పుణెల్లోనే లీగ్ మ్యాచ్​లను నిర్వహించాలని నిర్ణయించింది.  మే 22న సన్ రైజర్స్ పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్ తో లీగ్ మ్యాచ్​లు ముగుస్తాయి. మే 29న ఫైనల్​ జరగనుంది. ప్లే ఆఫ్స్, ఫైనల్​ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. 

కొత్త ఫార్మాట్​.. కొత్త రూల్స్​..

ఈసారి లీగ్​ ఫార్మాట్‌‌ను మార్చారు. మొత్తం 10 టీమ్ లను రెండు గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్– ఎలో ముంబై, కోల్ కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నో ఉండగా.. గ్రూప్–బిలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ ఉన్నాయి. ప్రతీ టీమ్‌‌ తన గ్రూప్‌‌లోని నాలుగు జట్లతో రెండుసార్లు, అవతలి గ్రూప్‌‌లో ఒక టీమ్‌‌తో రెండు మ్యాచ్‌‌లు, మిగతా నాలుగింటితో ఒక్కో మ్యాచ్‌‌ ఆడుతుంది. మొత్తంగా గతంలో మాదిరిగానే  ప్రతీ టీమ్ ఓవరాల్‌‌గా14 మ్యాచ్‌‌ల్లో తలపడుతుంది. లీగ్ స్టేజ్ ముగిసే సరికి ఎక్కువ పాయింట్లతో ఉన్న నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అవుతాయి. ఇక, ఈసారి కొన్ని కొత్త రూల్స్‌‌ కూడా చేర్చారు. ఇన్నింగ్స్​లో ప్రతీ టీమ్‌‌కు రెండు డీఆర్‌‌ఎస్‌‌లు ఇస్తారు. కొత్త బ్యాటరే స్ట్రయికింగ్‌‌ తీసుకోవాలి. మన్కడింగ్‌‌ను అధికారికం చేశారు. దీన్ని రనౌట్‌‌గా పరిగణిస్తారు.

కొత్త విజేతను చూస్తామా? 

ఇప్పటివరకు 14 సీజన్లు జరగగా కేవలం రెండు టీమ్స్ (ముంబై, చెన్నై) మాత్రమే 9 టైటిళ్లు సాధించాయి. దీనిని బట్టి చూస్తే లీగ్ లో ఈ జట్ల హవా ఎలా ఉందో అర్థమవుతోంది. కాగా, విరాట్ కోహ్లీలాంటి స్టార్ ప్లేయర్ ఉన్న ఆర్ సీబీతో పాటు పంజాబ్, ఢిల్లీ ఇప్పటివరకు ఒక్క టైటిల్  కూడా నెగ్గలేకపోయాయి. దీంతో ఈసారైనా ఇందులో ఒక జట్టుకు అదృష్టం కలిసి రావాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఇక, ఈసారి కొత్త జట్లుగా బరిలో నిలిచినా గుజరాత్, లక్నో కూడా తమ లక్ పరీక్షించుకోనున్నాయి.

పిచ్‌‌లు ఎట్లుంటయో...

ఈ సీజన్​లో ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్‌‌, బ్రబౌర్న్‌‌ స్టేడియాలు 55 లీగ్‌‌ మ్యాచ్‌‌లకు, పుణెలోని ఎంసీఏ స్టేడియం 15 లీగ్‌‌ మ్యాచ్‌‌లకు ఆతిథ్యం ఇస్తుంది. టోర్నీ కేవలం నాలుగు స్టేడియాల్లోనే జరగనుండటం వల్ల రెండు నెలల పాటు పిచ్ సహజత్వాన్ని కాపాడటం క్యూరేటర్లకు కష్టమైన పనే అయినా సగం మ్యాచ్ ల్లో భారీ స్కోరింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎర్ర మట్టితో కూడిన ముంబైలోని వాంఖడే, సీసీఐ, డీవై పాటిల్ పిచ్ లు బౌన్స్ కు ఎక్కువగా అనుకూలించే చాన్స్ కనిపిస్తోంది. నల్ల మట్టితో చేసిన పుణె పిచ్ లో స్పిన్నర్లు చెలరేగడం ఖాయంగా అనిపిస్తోంది.  

 యంగ్ ప్లేయర్లకు కీలకం

ఈ ఏడాది అక్టోబర్​లో ఆస్ట్రేలియా గడ్డపై టీ-20 వరల్డ్ కప్​ జరగనుంది. ఇందులో పోటీపడే ఇండియా టీమ్​లో చోటు ఆశిస్తున్న ప్లేయర్లు ఈ లీగ్ లో రాణించాల్సి ఉంటుంది. ఇప్పటికే టీమిండియాలో చోటు కోసం చూస్తున్న వారితో పాటు ఇటీవల అండర్ 19 ట్రోఫీ గెలిచిన యంగ్​స్టర్స్​ కూడా రేసులో ఉన్నారు.  

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ పై ఫోకస్

ఈసారి లీగ్ లో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మరో అంశం కొత్త కెప్టెన్లు. లీగ్ లోకి ఫస్ట్ టైమ్ అడుగుపెడుతున్న గుజరాత్ టైటాన్స్.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్​గా నియమించుకుంది. అలాగే పంజాబ్ కింగ్స్ సీనియర్ ప్లేయర్ మయాంక్ పై నమ్మకముంచింది. సీఎస్‌‌కే ఈసారి జడేజా నాయకత్వంలో ముందుకు సాగనుంది. ఈ ముగ్గురికీ ఇంతకుముందు ఫుల్ టైమ్ కెప్టెన్ గా చేసిన అనుభవం లేకపోవడం గమనార్హం. అదే టైమ్​లో ఇంతకుముందు ఢిల్లీకి కెప్టెన్ గా చేసిన శ్రేయస్ ఈసారి కోల్ కతా నైట్ రైడర్స్ కు, గత సీజన్​ దాకా పంజాబ్ కు నాయకత్వం వహించిన కేఎల్ రాహుల్ కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. టీమిండియా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ ప్యూచర్ కెప్టెన్ కోసం వెతుకుతుండటం వల్ల.. ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు వీరందరికీ ఇది మంచి చాన్స్. మరోవైపు విరాట్‌‌ కోహ్లీ ప్లేస్‌‌లో ఆర్‌‌సీబీ బాధ్యతలు తీసుకున్న డుప్లెసిస్‌‌పైనా అందరి ఫోకస్‌‌ ఉంది. 

ఏబీ, గేల్​, రైనా లేకుండానే.. 

తమ ఆటతో లీగ్​కే వన్నె తెచ్చిన పలువురు మెగా స్టార్స్​ ఈసారి  కనిపించడం లేదు. సౌతాఫ్రికా లెజెండ్​ ఏబీ డివిలియర్స్​  క్రికెట్​కు రిటైర్మెంట్​ ఇవ్వగా.. విండీస్​ డేంజర్​  క్రిస్​ గేల్, సీఎస్​కే చిన్నతలా సురేశ్​ రైనాను   ఎవ్వరూ కొనలేదు.

ధోనీకి ఫేర్​వెల్​ సీజన్​!

ఈ సీజన్ కు ముందు  సీఎస్​కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న  ఎంఎస్ ధోనీ.. ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. 40 ఏళ్ల ధోనీకి ఈ సీజన్ చివరిదని చాలామంది భావిస్తున్నారు. ఒకవేళ ఈ సీజన్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. తర్వాత ఎడిషన్ లో సీఎస్​కేకు మహీ మెంటార్ గా వ్యవహరించే చాన్సుంది. ఆర్​సీబీ కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీపై కూడా అందరి దృష్టి ఉంది. ఓ ప్లేయర్​గా తను ఎలా ఆడతాడనే దానిపై ఆసక్తి నెలకొంది. 

బోణీ ఎవరిదో!

నేడు చెన్నై, కోల్​కతా మధ్య తొలి మ్యాచ్
రాత్రి 7.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో

ముంబై: డిఫెండింగ్ చాంప్​ చెన్నై సూపర్ కింగ్స్, నిరుడు రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ పోరులో గెలిచి లీగ్ లో బోణీ కొట్టాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ రెండు టీమ్స్ ఈసారి కొత్త కెప్టెన్లతో బరిలో దిగబోతుండటం మరో విశేషం. సీజన్ కు రెండు రోజుల ముందు కెప్టెన్ గా తప్పుకొంటున్నట్లు ప్రకటించిన ధోనీ.. జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. దీంతో ఇప్పటివరకు ఫుల్ టైమ్ కెప్టెన్ గా అనుభవం లేని జడ్డూ  ఈసారి టీమ్ ను ఎలా నడిపిస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నిరుడు ఇంగ్లండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఫైనల్ వరకు వెళ్లిన కేకేఆర్.. ఈసారి అతడిని వేలానికి ముందే వదిలేసింది. ఆ తర్వాత వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకుని అతడికి కెప్టెన్సీ అప్పగించింది. ఇంతకుముందు 2020లో ఢిల్లీకి కెప్టెన్ గా టీమ్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లిన అయ్యర్ పై మంచి అంచనాలున్నాయి. 

ఐపీఎల్​ఆల్‌‌టైమ్‌‌ బెస్ట్‌‌ వీరులు

  • మోస్ట్‌‌ రన్స్‌‌- విరాట్​ కోహ్లీ 6283
  • ఫోర్స్‌‌- శిఖర్‌‌ ధవన్‌‌ 654
  • సిక్సర్స్‌‌-క్రిస్‌‌ గేల్‌‌ 175
  • సెంచరీలు- క్రిస్‌‌ గేల్‌‌ 6
  • ఫాస్టెస్ట్‌‌ సెంచరీ- క్రిస్‌‌ గేల్‌‌ 30 బాల్స్‌‌లో ఫాస్టెస్ట్‌‌ ఫిఫ్టీ- లోకేశ్‌‌ రాహుల్‌‌ 14 బాల్స్‌‌లో టాప్‌‌ స్కోర్‌‌- క్రిస్‌‌ గేల్‌‌ 175
  • ఎక్కువ వికెట్లు- లసిత్‌‌ మలింగ170
  • బెస్ట్ బౌలింగ్‌‌ - అల్జారీ జోసెఫ్‌‌ 6/12
  • బెస్ట్‌‌ ఎకానమీ- రషీద్‌‌ ఖాన్‌‌ 6.33
  • ఎక్కువ డాట్‌‌ బాల్స్‌‌- హర్భజన్ 1268
  • ఎక్కువ హ్యాట్రిక్స్‌‌- అమిత్‌‌ మిశ్రా 3 సార్లు