ఐపీఎల్‌‌లో నేడు రెండు కీలక మ్యాచ్‌‌లు

ఐపీఎల్‌‌లో నేడు రెండు కీలక మ్యాచ్‌‌లు

ముందడుగు వేసేదెవరు..?

అబుదాబి/ దుబాయ్‌‌: ఐపీఎల్‌‌ 13 ప్లేఆఫ్స్​కు దగ్గరవ్వడంతో ప్రతీ మ్యాచ్‌‌ కీలకంగా మారింది. వీకెండ్‌‌ స్పెషల్‌‌ డబుల్‌‌ హెడర్‌‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌‌, కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ తలపడనున్నాయి. ఆ తర్వాత కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌, సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్లే ఆఫ్స్​ నేపథ్యంలో  ఈ మ్యాచ్‌‌ల రిజల్ట్‌‌ ప్రతీ జట్టుకి కీలకం.

సన్‌‌రైజర్స్‌‌ గెలిచేనా..

లీగ్‌‌ స్టేజ్‌‌లో చెరో  పది మ్యాచ్‌‌లాడిన తర్వాత తలా ఎనిమిది పాయింట్లతో సన్‌‌రైజర్స్‌‌, పంజాబ్‌‌ ప్రస్తుతం 5,6 పొజిషన్లలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌‌కు చేరాలంటే రెండు జట్లు తమ మిగిలిన మ్యాచ్‌‌లన్నీ గెలిచి తీరాలి. దీంతో ఈ మ్యాచ్‌‌లో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.  గురువారం రాజస్తాన్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ సాధించిన సన్‌‌రైజర్స్‌‌ ఊపులో ఉంది. జేసన్‌‌ హోల్డర్‌‌ చేరికతో మిడిలార్డర్‌‌ బలం పెరిగింది. యంగ్‌‌స్టర్స్‌‌ ప్రియమ్‌‌ గార్గ్‌‌, అబ్దుల్‌‌ సమద్‌‌, నటరాజన్‌‌ మరింత బాధ్యతగా ఆడితే హైదరాబాద్‌‌కు తిరుగుండదు. మరోపక్క పంజాబ్‌‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. వరుస ఓటములతో తీవ్ర నిరాశలోకి వెళ్లిన రాహుల్‌‌ సేన హ్యాట్రిక్​ విక్టరీలు సాధించి  ప్రస్తుతం  జోష్‌‌లో ఉంది. ముఖ్యంగా  గేల్‌‌ రాక తర్వాత పంజాబ్‌‌కు అన్నీ  కలిసొస్తున్నాయి. పైగా జట్టులో పెద్దగా సమస్యల్లేవు.  రాహుల్‌‌, మయాంక్‌‌, గేల్‌‌, పూరన్‌‌ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉండగా.. మ్యాక్స్‌‌వెల్‌‌ తడబాటు ఒక్కటే వారిని ఇబ్బంది పెడుతోంది. జిమ్మీ నిషమ్‌‌ చేరికతో బౌలింగ్‌‌ బలం కూడా పెరిగింది. ఏదేమైనా పంజాబ్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను అడ్డుకోవడంపైనే సన్‌‌రైజర్స్‌‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఒత్తిడంతా కేకేఆర్‌‌పైనే..

అంతకుముందు కోల్‌‌కతాతో పోరులో ఢిల్లీ టాప్‌‌ ప్లేస్‌‌ లక్ష్యంగా బరిలోకి  దిగనుంది. బెంగళూరు చేతిలో చిత్తయిన కేకేఆర్‌‌… ఈ మ్యాచ్‌‌లోనూ ఓడితే ప్లే ఆఫ్‌‌ ఆశలు ఆవిరైనట్టే. రసెల్‌‌, నరైన్‌‌ను ఆడిస్తారో లేదో చూడాలి. కానీ, బ్యాటింగ్‌‌లో రాణించకపోతే కేకేఆర్‌‌ గెలుపు అసాధ్యం. మరోపక్క ఢిల్లీ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. శిఖర్‌‌ ధవన్‌‌ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉండగా.. పృథ్వీ షా నుంచి జట్టు మరింత ఆశిస్తోంది.