హైదరాబాద్సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువుల(అన్ క్లెయిమ్ ఐటమ్స్)ను శనివారం (జనవరి 24) జేబీఎస్లో వేలం వేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన వేలానికి ఆదరణ లభించిందని, చాలా రకాల వస్తువులు తక్కువ ధరలకే చాలా మంది సొంతం చేసుకున్నారని గుర్తు చేశారు.
మరోసారి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జేబీఎస్లాజిస్టిక్ విభాగంలో వేలం ఉంటుందని గ్రేటర్ ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్(లాజిస్టిక్స్) ఇషాక్ బిన్మహ్మద్ తెలిపారు. ప్రతినెలా నిర్వహించే వేలంలో వస్తువులను 30 నుంచి 50 శాతం తక్కువ ధరలకే ఇస్తున్నామన్నారు. ఈ సారి 31 రకాల ఉత్పత్తులను వేలం వేయనున్నట్టు తెలిపారు.
