నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ TRS అభ్యర్థుల నామినేషన్‌!

నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ TRS అభ్యర్థుల నామినేషన్‌!

హైదరాబాద్‌, వెలుగు: స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 12 ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సోమవారం నామినేషన్‌ వేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించకపోయినా, ఎవరెవరికి అవకాశం ఇస్తున్నామనే సమాచారం పార్టీ నాయకత్వం నుంచి  వాళ్లకు ఇప్పటికే వెళ్లింది. పన్నెండు స్థానాల్లో పదకొండు స్థానాలకు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. నిజామాబాద్​ సీటుపై డైలమా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పలువురు అభ్యర్థులు ఆదివారం తెలంగాణ భవన్‌కు వచ్చి నామినేషన్‌  దాఖలు చేయడానికి అవసరమైన పేపర్లు రెడీ చేసుకున్నారు. 

కొందరికి ఇప్పటికే బీఫాంలు అందజేయగా..  మరికొందరికి సోమవారం ఉదయం ఇస్తారని సమాచారం. 12 స్థానాల్లో ప్రస్తుతం టీఆర్​ఎస్​ వాళ్లే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఐదుగురికి మాత్రమే రెన్యువల్‌‌‌‌ అయినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్‌‌‌‌ మంత్రుల సమావేశంలో వెల్లడించినట్టు సమాచారం. 

అభ్యర్థులు వీళ్లే..!

వరంగల్‌‌‌‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌‌‌‌ రెడ్డి, శంభీపూర్‌‌‌‌ రాజు, కరీంనగర్‌‌‌‌ నుంచి భానుప్రసాద్‌‌‌‌రావు, మహబూబ్‌‌‌‌ నగర్‌‌‌‌ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మళ్లీ అవకాశం ఇచ్చినట్టు టీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. కరీంనగర్‌‌‌‌ నుంచి ఇంకో సీటుకు టీడీపీ నుంచి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిన ఎల్‌‌‌‌. రమణ పేరు ఖరారు చేసినట్టు తెలిసింది. మహబూబ్‌‌‌‌ నగర్‌‌‌‌ నుంచి రెండో సీటుకు గాయకుడు సాయిచంద్‌‌‌‌ పేరు ఖాయం చేసినట్టు సమాచారం. ఆదిలాబాద్‌‌‌‌ నుంచి దండె విఠల్‌‌‌‌, మెదక్‌‌‌‌ నుంచి సీఎం కేసీఆర్‌‌‌‌ స్నేహితుడు డాక్టర్‌‌‌‌ యాదవ రెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధు పేర్లు కన్ఫామ్‌‌‌‌ చేసినట్టు తెలిసింది. నల్గొండ నుంచి నాగార్జునసాగర్‌‌‌‌ నియోజకవర్గానికి చెందిన ఎంసీ కోటిరెడ్డి పేరును ఓకే చేసినట్లు సమాచారం. 

కవితకా.. లలితకా?

నిజామాబాద్‌‌‌‌ ఎమ్మెల్సీ స్థానంపై డైలమా కొనసాగుతున్నది. ఇక్కడి నుంచి సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీకి దూరంగా ఉంటే.. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు చాన్సిస్తారని సమాచారం. కవితకు ఏ పదవి ఇస్తారనేదానిపై చర్చ జరుగుతోంది.