
అబుదాబి: వరుసగా రెండు భారీ విజయాలతో ఆసియా కప్‌లో ఇప్పటికే సూపర్–- 4 రౌండ్‌కు క్వాలిఫై అయిన టీమిండియా గ్రూప్ దశలో ఆఖరాటకు సిద్ధమైంది. శుక్రవారం (సెప్టెంబర్ 19) అబుదాబిలో జరిగే తమ చివరి గ్రూప్ లీగ్ మ్యాచ్ పసికూన ఒమన్‌తో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ ఇండియాకు నామమాత్రమే అయినప్పటికీ సూపర్–4లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరగబోయే కీలక సమరానికి ముందు తమ బ్యాటర్లకు తగినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చేందుకు దీన్ని ఒక గోల్డెన్ చాన్స్‌గా భావిస్తోంది.
ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో టార్గెట్లు చిన్నవి కావడంతో ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌కు పెద్దగా అవకాశం రాలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాలు ఇస్తున్నప్పటికీ, శుభ్‌మన్ గిల్ మరికొంత సేపు క్రీజులో ఉండాలని కోరుకుంటున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ పాకిస్తాన్‌పై రాణించినా, హైదరాబాదీ తిలక్ వర్మకు మరింత బ్యాటింగ్ సమయం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరీ ముఖ్యంగా టోర్నమెంట్‌లో అసలు సిసలైన పోరు సూపర్–4 రౌండ్ మొదలయ్యే ముందు మిడిలార్డర్ బ్యాటర్లు హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వంటి వారు క్రీజులో కుదురుకోవాలని చూస్తున్నారు.
బరిలోకి అర్ష్‌దీప్, రాణా!
కీలకమైన సూపర్–4 దశకు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమ్ ప్రధాన అస్త్రం జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. బుమ్రాకు కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాల్సి ఉన్నా, అతని ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అదే జరిగితే, ఇప్పటివరకు అవకాశం రాని లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే చాన్సుంది.
జట్టులో ఆల్‌రౌండర్లకు పెద్దపీట వేస్తుండటంతో అర్ష్‌దీప్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో పాటు, స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్,వ రుణ్ చక్రవర్తిలో ఒకరికి విశ్రాంతినిచ్చి, మరో పేసర్ హర్షిత్ రాణా సత్తాను కూడా పరీక్షించే అవకాశం లేకపోలేదు. ఇక ఈ పోరులో సంజూ శాంసన్‌పై అందరి ఫోకస్ ఉండనుంది. ఈ టోర్నీలో వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నప్పటికీ తనకు ఇంతవరకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో చాన్స్ వస్తే సంజూ తన సత్తా చాటుతాడో లేదో చూడాలి
ఒమన్ పోటీ ఎంత
ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ఒమన్ జట్టు... ఇండియాకు ఏమాత్రం పోటీ ఇస్తుందన్నది ఆసక్తికరం. గెలుపు, ఓటములు పక్కనబెడితే ఈ మ్యాచ్‌లో స్టార్లతో కూడిన టీమిండియాతో తలపడటమే ఆ టీమ్‌కు ఓ గొప్ప అవకాశం కానుంది. వచ్చే నెలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఒమన్.. ఇండియా వంటి పటిష్టమైన జట్టుతో ఆడటం ద్వారా ఎంతో నేర్చుకోవాలని భావిస్తోంది.
కెప్టెన్ జతీందర్ సహా ఒమన్ టీమ్‌లో పలువురు ఇండియా సంతతి ప్లేయర్లు ఉండటం విశేషం. కాగా, ఈ టోర్నీలో పాకిస్తాన్, యూఏఈతో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా ఫెయిలయ్యార్లు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఒక్క బ్యాటర్ కూడా 30 రన్స్ మార్కును దాటలేకపోయాడు. అయితే, లెఫ్టార్మ్ స్పిన్నర్ షకీల్ అహ్మద్‌పై ఒమన్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ టోర్నీలో షకీల్ పవర్‌ప్లేలో కేవలం 3.50 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అయితే ఇండియా బ్యాటర్లకు తను ఏ మేరకు పోటీనిస్తాడో చూడాలి. ఇక, దుబాయ్‌తో పోలిస్తే అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అంతగా అనుకూలించదు. ఇండియా, ఒమన్ తమ తుది జట్లలో మార్పులు చేసే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా):
ఇండియా: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి.
ఒమన్: జతీందర్ సింగ్ (కెప్టెన్), ఆమిర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వసీం అలీ, ఆర్యన్ బిష్త్, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), జితేన్ రామానంది, షా ఫైజల్, షకీల్ అహ్మద్, హస్నైన్ షా, సమయ్ శ్రీవాస్తవ.