తెలుగు నేలపై పీడిత ప్రజల హక్కులు, అవకాశాల కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న సమ సమాజ స్థాపన కోసం నిరంతరం పోరాడిన మహత్తర శక్తి ఈశ్వరీబాయి. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరి దేహంలో అణువణువునా స్ఫూర్తిని రగిలిస్తున్న రణ నినాదం ఈశ్వరీబాయి. ఈశ్వరీబాయి సికింద్రాబాద్లోని చిలకలగూడకు చెందిన బల్లెపు రామస్వామి, రాములమ్మ దంపతులకు 1918వ సంవత్సరం డిసెంబర్ 1న జన్మించారు. ఆమెకు 13వ ఏట పూణేకు చెందిన వైద్యుడితో వివాహం జరిగింది. కూతురు గీత (మాజీ మంత్రి, ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి) జన్మించిన కొద్ది రోజులకు ఈశ్వరీబాయి భర్త అకాల మరణం చెందారు. తన కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ పూణేలో కొద్ది రోజులు గడిపిన ఆమె తర్వాత పుట్టింటికి తిరిగి వచ్చారు. ఆమెరాక హైదరాబాద్ నగరంలో ఉద్యమాలకు కొత్త ఊపిరి పోసింది.
అచంచలమైన ఆత్మవిశ్వాసం, తలవంచని ఆత్మాభిమానం, మొక్కవోని ధైర్యం, పట్టు విడవని పట్టుదల కలిగిన ఈశ్వరీబాయి ఒకవైపు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే మరోవైపు ఉద్యమాలలో అలుపెరగకుండా పోరాడారు. హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే సంస్థను స్థాపించి ఉద్యమాలను ఉవ్వెత్తున నడిపిస్తున్న మాదరి భాగ్యరెడ్డి వర్మ రగిలించిన స్ఫూర్తితో ఆమె దళిత ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. భాగ్యరెడ్డి వర్మతోపాటు బీఎస్. వెంకటరావు, అరిగే రామస్వామి, జేహెచ్ సుబ్బయ్య, బత్తుల శ్యాంసుందర్ వంటి నాయకులతో కలిసి వారికి దీటుగా పని చేశారు. మహిళలు ఉన్నత విద్యతోపాటు, సాంకేతిక వైజ్ఞానిక, క్రీడా రంగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రజా సంస్థలలో కూడా చేరి పని చేయాలని మహిళల కు బోధించేవారు. ఉద్యమాల్లో ముందు వరుసలో నిల బడి పోరాడిన తీరు మహిళల్లో స్పూర్తిని రగిలించేది.
రాజ్యాధికారం బలమైన ఆయుధం
సకల సమస్యలను పరిష్కరించడంలో రాజ్యాధికారం మాస్టర్ కీ లాంటిది అంటూ డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని పసిగట్టిన ఈశ్వరీబాయి ఒకవైపు సామాజిక ఉద్యమాల్లో చురుకుగా ఉంటూనే మరోవైపు రాజకీయ రంగప్రవేశం చేశారు. 1952వ సంవత్సరంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా హైదరాబాద్ నగర పురపాలక సంఘం ఎన్నికల్లో గెలుపొందారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) నుంచి ఈశ్వరీబాయి మొదటిసారి 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.ఎన్.సదాలక్ష్మిపై నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి, రెండోసారి 1972లో జరిగిన ఎన్నికల్లో నంది ఎల్లయ్యపై విజయం సాధించి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యురాలుగా, ప్రతిపక్ష నాయకురాలిగా సమర్థవంతంగా పని చేశారు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో పేదల పక్షాన పోరాడింది. పదవులున్నా లేకున్నా ప్రజల కోసం, ప్రజల మధ్య తన జీవితాన్ని సాగించింది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో...
నీళ్లు, -నిధులు, నియామకాలు అనే నినాదంతో 1969లో ఉవ్వెత్తున కొనసాగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ ప్రజాసమితికి వైస్ ప్రెసిడెంటుగా వ్యవహరిస్తూ క్రియాశీలకంగా పని చేశారు. తెలుగు నేలపై దళితులపై ఎక్కడ దాడులు జరిగినా తక్షణమే అక్కడకు చేరుకొని బాధితుల పక్షాన నిలబడి వారిలో ధైర్యాన్ని నింపేది. అసెంబ్లీలో ఆ దాడుల గురించి ప్రస్తావించి పాలకుల నిర్లక్ష్యంపై అగ్నిశిఖలా విరుచుకుపడేది. ఒకవైపు దళితుల హక్కుల కోసం పోరాడుతూ మరోవైపు వారి అభ్యుదయానికి, వారికి జీవనోపాధిని కల్పించే కార్యక్రమాలు రూపొందించటానికి ఆమె చేసిన కృషి ప్రశంసనీయమైనది. సబ్బండ వర్గాల శ్రేయస్సు కోసం ఆఖరిశ్వాస వరకు అవిశ్రాంతంగా పోరాడిన ఈశ్వరీబాయి 1991 ఫిబ్రవరి 24న మహా పరినిర్యాణం చెందారు. ఐకమత్యమే మన ఆయుధం అని ఆమె చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని మన హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేయాలి.
- డా. మంచాల లింగస్వామి,
సోషల్ ఎనలిస్ట్,
చైర్మన్, మాల ప్రజాఫ్రంట్
