గిట్టుబాటు కాక టమాట తోటల్ని వదిలేస్తున్న రైతులు  

గిట్టుబాటు కాక టమాట తోటల్ని వదిలేస్తున్న రైతులు  

మహబూబ్​నగర్​, వెలుగు: టమాట రేట్లు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు కాకపోవడంతో టమాట తోటలను రైతులు అట్లనే వదిలేసుకుంటున్నారు. రాష్ట్రంలో దిగుబడులు బాగా రావడం, పక్క రాష్ట్రాల నుంచీ మార్కెట్లకు పంట భారీగా వస్తుండటంతో వ్యాపారులు రేట్లను ఒక్కసారిగా దించేశారు. రైతులకు కిలో టమాటకు రూ. 3 నుంచి రూ. 5 లోపలే చెల్లిస్తున్నారు. దీంతో ఈ రేటుకు అమ్ముకుంటే పెట్టుబడి కూడా ఎల్లే పరిస్థితి లేక.. రైతులు టమాట తోటలను వదిలేస్తున్నారు. రైతుల నుంచి రేట్లు తగ్గించి కొంటున్న వ్యాపారులు.. మార్కెట్లో ప్రజలకు మాత్రం కిలో టమాట రూ. 10 వరకూ పెంచి అమ్ముతున్నారు.

రాష్ట్రమంతా ఇదే పరిస్థితి 

వరంగల్​, హన్మకొండ ప్రాంతాల్లో వ్యాపారులు రైతుల నుంచి తక్కువ రేటుకే టమాటను కొంటున్నారు. క్వాలిటీని బట్టి కిలోకు రూ.3 నుంచి రూ.5 లోపే ఇస్తున్నారు. జనగామ జిల్లాలో వ్యాపారులు కిలోకు రూ.4 నుంచి రూ.5 చెల్లిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిలో టమాటకు రైతులకు రూ.5 నుంచి6 వరకు , మంచిర్యాలలో రూ.5, సిద్దిపేట జిల్లాలో కిలోకు రూ.8 చొప్పున వ్యాపారులు రేట్​ కడుతున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూర్​, హన్వాడ, మిడ్జిల్​, నవాబ్​పేట, బాలానగర్​, మహ్మదాబాద్​, గండీడ్​ మండలాల నుంచి పాలమూరు మార్కెట్​కు తెస్తున్న టమాటకు వ్యాపారులు రూ.3 నుంచి రూ.4 మాత్రమే చెల్లిస్తున్నారు. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, మదనపల్లె ప్రాంతాల నుంచీ వ్యాపారులు తక్కువ రేటుకే టమాటాలు కొని పాలమూరు మార్కెట్‌‌కు తీసుకొస్తున్నారు. దీంతో స్థానిక రైతులకు రేట్లు గిట్టుబాటు కాక నష్టపోతున్నారు. ఈనెల మొదటి వారంలో కిలో టమాట హోల్​సేల్​ ధర15 ఉండగా, రెండో వారంలో రూ.12, మూడో వారం నుంచి రూ.10 పలికింది. తాజాగా కిలో టమాట రేటు రూ.3 నుంచి రూ.5కు పడిపోయింది.  

రవాణా చార్జీలూ రావట్లే 

మార్కెట్లో టమాట బాక్స్​ (25 కిలోలు) రూ.70 నుంచి రూ.80 లోపు మాత్రమే రేట్​ పలుకుతోంది. దీంతో మార్కెట్ కు పంటను తెచ్చే రైతులకు రవాణా చార్జీలు కూడా రావడంలేదు. పాలమూరు మార్కెట్​కు గండీడ్​, నవాబ్​పేట మహ్మదాబాద్​, హన్వాడ మండలాల నుంచి రైతులు టమాటను తేవాలంటే ఒక బాక్సుకు రూ.30 చొప్పున ఆటో కిరాయి తీసుకుంటున్నారు. బస్సులో తేవాలన్నా లగేజీ టికెట్​ కొడుతున్నారు. ఈ లెక్కన ఒక బాక్సును మార్కెట్లో వ్యాపారులు రూ.80 వరకు కొంటే, రైతులకు బాక్స్​ మీద రూ.50 మాత్రమే మిగులుతున్నది. ఇవి కూడా తిరిగి వారు ఊళ్లకు పోవడానికి, చాయ్​, టిఫిన్లు, చార్జీలకే సరిపోతున్నయి. 

రూ. 10, 15 అయితేనే గిట్టుబాటు 

మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సారి టమాట దిగుబడుగులు భారీగా వస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో దంటుకు రోజు విడిచి రోజు కిలోన్నర నుంచి రెండు కిలోల పండ్లు కాస్తున్నాయి. ఎకరా తోటకు 800 కిలోల నుంచి 900 కిలోల వరకు రోజు విడిచి రోజు దిగుబడులు వస్తున్నాయి. కానీ, మార్కెట్లో రేట్​ లేదు. కిలో టమాట హోల్​సేల్​లో రూ.10 నుంచి రూ.15 వరకు పలికితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అంతకన్నా తక్కువ ధర ఉండటంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.  
ఇతని పేరు జుర్కి నర్సింహులు. నవాబ్​పేట మండలం రుక్కంపల్లి గ్రామం. యాసంగిలో రెండు ఎకరాల్లో టమాట వేశాడు. రూ.70 వేల వరకు ఖర్చు చేశాడు. పది రోజులుగా రేట్​ లేకపోవడంతో ఎకరా తోటను దున్నేశాడు. మరో ఎకరాలో టమాటను తెంపకుండానే వదిలేసిండు. ప్రస్తుతం ఇతని తోటలో దాదాపు 20 క్వింటాళ్ల టమాట ఉంది. 

ఇతని పేరు బత్తుల రమేశ్​. బాలానగర్​ మండలం అమ్మపల్లి గ్రామం. ఎకరా పొలంలో టమాట తోట పెట్టుకున్నడు. టమాట బాగా కాసింది. కానీ, రేట్​ లేకపోవడంతో వారం రోజుల నుంచి తోటకు నీళ్లు పెట్టడం బంద్​ చేసిండు. చేసిన కష్టానికి కూడా పైసలు ఎల్తలేవని తోటను వదిలేసిండు. ఇతని పేరు పులి అనంతయ్య. మహ్మదాబాద్​ మండలం గాదిర్యాల్​ గ్రామం. యాసంగిలో అరెకరం టమాట తోట వేసుకున్నడు. విత్తనాలు, నారు పోసుకోవడానికి, మందులు, కలుపు తీత ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.20 వేల దాకా ఖర్చు చేసిండు. ప్రస్తుతం పది రోజులుగా మార్కెట్లో టమాట ధరలు పడిపోవడంతో పంటను తెంపలేదు. గిట్టుబాటు ధర కూడా రావడం లేదని అట్లనే వదిలేసిండు.