
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మోటార్ వెహికల్ యాక్ట్ సవరణ బిల్లును విరమించుకోవాలని ఆర్టీసీ కార్మి క సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల కుదింపు, హక్కుల తొలగింపుకు కేంద్రం చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తెలిపారు. రక్షణ, రైల్వే, ఇన్సూరెన్స్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని కోరారు. కేంద్ర సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాల తగ్గింపుపై మండిపడ్డారు. ఒకే పనికి ఒకే విధమైన జీతాన్ని చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. ఈ సవరణ బిల్లు యూనియన్ ఏర్పాటు, సమ్మె చేసే హక్కులు లేకుండా చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ధర్నాలు చేస్తున్నట్లు తెలిపారు.