మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ.. టాప్ లీడర్ మిసిర్ బెస్రా అరెస్ట్

మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ.. టాప్ లీడర్ మిసిర్ బెస్రా అరెస్ట్

రాంచీ: దేశంలో దాదాపు అంతరించిపోయిన మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, సెంట్రల్ కమిటీ మెంబర్ మిసిర్ బెస్రా అరెస్ట్ అయ్యాడు. జార్ఖండ్‎లోని ధన్‎బాద్ జిల్లాలో భద్రతా సంస్థలు ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. భద్రతా దళాల మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లో ఉన్న మిసిర్ బెస్రాపై కోటి రూపాయలకు పైగా రివార్డ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

మావోయిస్ట్ పార్టీలో కీలకమైన వ్యక్తుల్లో బెస్రా ఒకరని.. ఆయన అరెస్ట్ భద్రతా దళాల భారీ విజయమని అధికారులు పేర్కొన్నారు. మిసిర్ బెస్రా అరెస్టుతో జార్ఖండ్‎లో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా బలహీనపడతాయని పోలీసులు అంచనా వేశారు. మరోవైపు.. మావోయిస్ట్ పార్టీ నెట్‌వర్క్, నాయకత్వ నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలపై నిఘా సమాచారం సేకరించేందుకు అధికారులు బెస్రాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

16 మంది మావోయిస్టులు లొంగిపోయారు

జార్ఖండ్‎లో మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగిలింది. 16 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. సరెండర్ అయిన వారిపై రూ. 39 లక్షల రివార్డు ఉంది. 128 కేసులలో నిందితుడిగా ఉన్న సంతోష్ మహతో అలియాస్ బసుదేవ్ దా అలియాస్ దిలీప్ కూడా లొంగిపోయిన వారిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు సబ్-జోనల్ కమిటీ సభ్యులు, ఇద్దరు ఏరియా కమిటీ కార్యకర్తలు కూడా సరెండర్ అయినట్లు వెల్లడించారు.