రాష్ట్రవ్యాప్తంగా వడగండ్లు, ఈదురు గాలులతో కుండపోత

రాష్ట్రవ్యాప్తంగా వడగండ్లు, ఈదురు గాలులతో కుండపోత
  • ఆరు జిల్లాల్లో పంట నష్టం
  • తడిసిన మిర్చి, పల్లీలు, మక్కలు
  • నేలరాలిన మామిడి.. ఒరిగిన వరి
  • పిడుగులు పడి నలుగురి మృతి
  • హైదరాబాద్‌‌లోనూ భారీ వర్షం.. రాజేంద్రనగర్‌‌‌‌లో 4.3 సెం.మీ.
  • మరో మూడు రోజులు వర్షా లు


నెట్‌‌వర్క్‌‌/హైదరాబాద్, వెలుగు: చెడగొట్టు వానలు పంటలను నాశనం చేశాయి. వడగండ్లు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మక్కలు.. మార్కెట్లకు తెచ్చిన పల్లీలు, పప్పుశనగ తడిసి ముద్దయ్యాయి. టమాటా, బీరకాయ, పచ్చిమిర్చి, బొబ్బర్లు, మినుములు తదితర పంటలు దెబ్బతిన్నాయి. పొట్టదశలో ఉన్న వరి పొలాలు నేలవాలాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మామిడి పిందెలు నేలరాలాయి. పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ముగ్గురు గొర్లకాపర్లతో సహా నలు గురు చనిపోయారు. గ్రేటర్ హైదరాబాద్‌‌ పరిధిలో నూ భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రాజేంద్రనగర్‌‌‌‌లో 4.3 సెం.మీల వర్షపాతం నమోదైంది. 

మధ్యాహ్నం నుంచి..

ఆరు జిల్లాల్లోని 650 గ్రామాల్లో పంటలకు నష్టం జరిగిందని అధికారులు అంచనాలు వేశారు. జోగు లాంబ గద్వాల జిల్లాలో మధ్యాహ్నం 3 గంటలకు భారీ వర్షం కురిసింది. గద్వాల మార్కెట్ యార్డులో అమ్మకానికి ఉంచిన పల్లీ సంచులు తడిసిపోయాయి. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన పప్పుశనగ, ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మానవపాడు మం డలంలో మిర్చి రైతులు ఆగమయ్యారు. నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేట గ్రామంలో కల్లాల్లో ఆరబోసిన మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం పడింది. భారీ గాలుల కారణంగా పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వెంట కల్లాల్లో ఆరబోసుకున్న మిర్చి పంటంతా తడిసిపోయింది. చర్ల మండలం మామిడిగూడెంలో పిడుగుపాటుకు 20 మేకలు చనిపోయాయి. రోళ్లగడ్డ, నర్సాపురం, చింతలపాడు, లక్ష్మీపురం, చీమలగూడెం తదితర చోట్ల వందల ఎకరాల్లో మక్కజొన్న నేలకొరిగింది. చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, ఇల్లెందు ప్రాంతాల్లో మామిడి చెట్లకు ఉన్న పిందెలు నేలరాలాయి. జయశంకర్​భూపాలపల్లి జిల్లా కసింపల్లిలో కల్లాల్లో ఎండబోసిన మిర్చి తడిసిపోయింది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా, లక్ష్మీపురం గ్రామాల్లో ఇండ్ల కప్పులు ధ్వంసమయ్యాయి.

పిడుగుపాటుకు ముగ్గురు కాపర్లు, ఒక రైతు మృతి

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామంలో పిడుగుపాటుతో గొర్రెల కాపరి చనిపోయింది. చిట్యాల గ్రామానికి చెందిన బాలయ్య, లక్ష్మి (50) దంపతులు గొర్రెలను మేపేందుకు పెంచికలపాడు వచ్చారు. కృష్ణా నది ఒడ్డున గొర్రెలను మేపుతుండగా భారీ వర్షం రావడంతో భార్యాభర్తలిద్దరూ దగ్గర్లోని చెట్టు కిందకి వెళ్లారు. చెట్టు మీద పిడుగు పడటంతో లక్ష్మి చనిపోయింది. బాలయ్య, దూరంగా ఉన్న వాళ్ల కొడుకు సందీప్ బతికి బయటపడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో పిడుగుపాటుతో రైతు చాకలి జయన్న(40) చనిపోయాడు. పొలంలో ఉన్న  పొగాకు దోరణాలు వానకు తడవకుండా ఉండేందుకు బరకం కప్పుతుండగా పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లింగసా యింపల్లిలో పిడుగుపాటుతో బాలకృష్ణ (22) అనే యువకుడు చనిపోయాడు. ఏపీలోని మాచర్ల మం డలం చింతలతండాకు చెందిన రమావత్ సైదా (17).. గొర్రెలను మేపేందుకు నాగార్జున సాగర్ ఎయిర్ పోర్ట్ సమీపంలోకి తీసుకెళ్లాడు. పిడుగు పడడంతో సైదాతో పాటు 40 గొర్రెలు చనిపోయాయి. వానతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో  మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. 


వడగండ్ల వర్షం

ప్రధానంగా వికారాబాద్‌‌, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడ గండ్ల వానలు బీభత్సం సృష్టించాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి, మోమిన్​పేట్ తదితర గ్రామాల్లో గంట పాటు కురిసిన వడగండ్లకు రోడ్లన్నీ మంచుదారుల్లా మారిపోయాయి. ఇండ్ల స్లాబ్‌‌లు, ఆవరణలు మంచు ముక్కలతో నిండిపోయాయి. సంగారెడ్డి జిల్లా వడగండ్ల వానకు జహీరాబాద్, కోహిర్, మునిపల్లి, రాయికోడ్, న్యాల్ కల్, ఝరాసంగం, వట్ పల్లి మండలాల్లోని వందలాది ఎకరాల్లో వరి, మక్క, శనగ, చెరుకు పంటలు దెబ్బతిన్నాయి. 

మరో 3రోజులు వానలు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రానికి మొన్న ఇచ్చిన ఎల్లో అలర్ట్​ను కాస్తా.. ఆరెంజ్​అలర్ట్​గా మార్చింది. ఇంకో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. వికారాబాద్​, మహబూబ్​నగర్​, రంగారెడ్డి, మెదక్​, హైదరాబాద్​, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్​ రూరల్​, మహబూబాబాద్​ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను ఇచ్చింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వడగండ్లు, ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. శని, ఆదివారాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది.  

‘‘ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయి. వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదముంది. ప్రజలు వర్షం కురిసే సమయంలో చెట్ల కిందగానీ.. కరెంట్​ పోల్స్​ వద్దగానీ నిలబడవద్దు. ఎలక్ట్రానిక్​ అప్లయన్సస్​ వద్ద జాగ్రత్తగా ఉండాలి. గాలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది” అని హైదరాబాద్​ వాతావరణ శాఖ డైరెక్టర్​ కె. నాగరత్న చెప్పారు. 


తర్భూజ మొత్తం పోయింది..

తర్భూజ పంట రెండు ఎకరాల్లో వేసినం. నాలుగు రోజుల్లో పంట కోద్దామనుకుంటున్న టైమ్‌‌లో వడగండ్ల వాన కురిసింది. పంట మొత్తం ధ్వంసమైంది. పెట్టిన పెట్టుబడి పోయింది. చేసిన కష్టం పోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి.
- బోడపల్లి ప్రవీణ్‌‌కుమార్‌‌, మర్పల్లి మండలం, వికారాబాద్‌‌ జిల్లా