- మీరు స్థలమిస్తే.. మేం అభివృద్ధి చేస్తామంటూ దేవాదాయ శాఖకు లేఖ
- ఆ భూముల్లో పర్యాటకులకు అవసరమైన వసతులు కల్పిస్తామని వెల్లడి
- పైలట్ ప్రాజెక్టుగా యాదగిరిగుట్ట
- ఇక్కడ సక్సెస్ అయితే రాష్ట్రమంతటా విస్తరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దేవాలయ భూములు ఇకపై కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని పంచే పర్యాటక కేంద్రాలుగా మారనున్నాయి. దేవాదాయశాఖ పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ ముందుకొచ్చింది. ఈ భూములను తమకు అప్పగిస్తే.. అక్కడ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామంటూ టూరిజంశాఖ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ల్యాండ్ ఇస్తే.. డెవలప్ చేస్తామని పర్యాటక శాఖ పేర్కొంది.
ఈ మేరకు దేవాదాయ శాఖకు లేఖ రాసింది. తర్వలో ఇదే అంశంపై ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరగనున్నట్లు తెలిసింది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములను పర్యాటక శాఖకు అప్పగిస్తే.. అక్కడ భక్తులు, టూరిస్టులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతిగృహాలు నిర్మిస్తామని టూరిజం శాఖ తెలిపింది. దీనికి ఎండోమెంట్ శాఖ నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఇరుశాఖల మంత్రుల భేటీ కానున్నట్లు సమాచారం. వీరిమధ్య ఒప్పందం కుదిరే ఈ ప్రాజెక్టు ముందుకుసాగనున్నది.
దేశ, విదేశీ పర్యాటకుల ఆకర్షణ
దేవాదాయ శాఖ తమ ఆధీనంలో ఉన్న, నిరుపయోగంగా పడి ఉంటున్న భూములను పర్యాటక శాఖకు లీజుకు లేదా అభివృద్ధి ఒప్పందంపై ఇస్తే.. ఆ స్థలాల్లో పర్యాటకశాఖ తన నిధులతో లేదా పీపీపీ పద్ధతిలో కాటేజీలు, రిసార్ట్‌లు, థీమ్ పార్కులు నిర్మించేలా ప్లాన్ చేస్తున్నది. దీనివల్ల ఆలయాలకు ఆదాయం సమకూరుతుంది. పర్యాటక శాఖకు బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నది. అంతేకాదు, అన్యాక్రాంతమవుతున్న భూములకు రక్షణగా ఉంటుంది. మరోవైపు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు టెంపుల్ టూరిజంతో పాటు వెల్ నెస్ సెంటర్లు (యోగ, ధ్యాన కేంద్రాలు) ఏర్పాటు చేయనున్నారు.
కలెక్టర్ల నుంచి సేకరిస్తున్న వివరాల ఆధారంగా ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పనులు చేపట్టనున్నారు. బడ్జెట్ హోటళ్ల నుంచి లగ్జరీ రిసార్ట్‌ల వరకు నిర్మించనున్నారు. ఆలయాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేవారికి వేదికలు ఏర్పాటు చేయనున్నారు. పురాణ ఇతిహాసాలను వివరించేలా సౌండ్ అండ్ లైట్ షోలు, మ్యూజియంలు, స్కల్చర్ పార్కులు. ఎకో టూరిజంలో డెవలప్మెంట్లో భాగంగా ఆలయాలు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటే ట్రెక్కింగ్, నేచర్ వాక్ వంటివి ఏర్పాటు చేయనున్నారు.
కాగా, ఏయే ఆలయాల వద్ద ఎంత భూమి ఉంది? అది రోడ్డుకు దగ్గరగా ఉందా? నీటి వసతి ఉందా? అనే అంశాలను పరిశీలించి త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయనున్నారు. కేవలం రాష్ట్ర భక్తులే కాకుండా.. ఇతర రాష్ట్రాల వారు, విదేశీ పర్యాటకులు కూడా తెలంగాణ ఆలయాలను సందర్శించేలా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. కేరళ, రాజస్థాన్ తరహాలో టెంపుల్ టూరిజాన్ని డెవలప్ చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆశించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా యాదగిరిగుట్ట
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే, దర్శనం తర్వాత భక్తులు అక్కడ బసచేయడానికి లేదా సేదతీరడానికి సరైన సౌకర్యాలు లేక వెంటనే తిరుగు ప్రయాణమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ సరికొత్త మాస్టర్ ప్లాన్ రచించింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. కొండ కింద సరైన వసతి సౌకర్యాలు, పర్యాటక ఆకర్షణలు లేవు.
దీంతో యాదగిరిగుట్ట పరిధిలోని ఎండోమెంట్ స్థలాల్లో హై-క్లాస్ కాటేజీలు, వెల్ నెస్ సెంటర్లు, బడ్జెట్ హోటళ్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించింది. ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు వీకెండ్ స్పాట్‌గా దీన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నది. యాదగిరిగుట్టలో ఈ ప్రయోగం విజయవంతమైతే.. వేములవాడ, భద్రాచలం, బాసర, కొమురవెల్లి వంటి ఇతర ప్రముఖ ఆలయాల భూముల్లోనూ ఇదే తరహా అభివృద్ధిని చేపట్టనున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ స్పందన కోసం టూరిజం అధికారులు వేచి చూస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ రాగానే సర్వే పనులు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.
