అమెరికాలో టూరిస్ట్ బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. ప్రయాణికుల్లో ఇండియా, చైనా పర్యాటకులు

అమెరికాలో టూరిస్ట్ బస్సు బోల్తా.. ఐదుగురు మృతి.. ప్రయాణికుల్లో ఇండియా, చైనా పర్యాటకులు

అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్టు బస్సు బోల్తా పడటంతో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. నయగారా ఫాల్స్ నుంచి న్యూయార్క్ సిటీ వెళ్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాద వశాత్తు బోల్తా పడింది. 54 మందితో వెళుతున్న బస్సులో ఎక్కువగా భారత్, చైనా టూరిస్టులే ఉండటం గమనార్హం. 

శుక్రవారం (ఆగస్టు 22) బఫెలో నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదు మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. న్యూయార్క్ పోలీస్ కమాండర్ ఆండ్రీ రే చెప్పిన వివరాల ప్రకారం..  బస్సు డ్రైవర్ పరధ్యానం వలన, కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కుడి వైపుకు వెళ్తున్న బస్సు అదుపుతప్పుతున్నట్లు గమనించి వెంటనే తిప్పడంతో కుడివైపు బోల్తాపడింది. 

ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు, సహాయక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు అందించారు. బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగారు. ఎనిమిది హెలీకాప్టర్లతో పాటు రక్షణ బలగాలు సహాయక చర్యలకు దిగాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద మృతుల్లో చిన్నపిల్లలు  లేరని తెలిపారు అధికారులు.