వంద సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తం: టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్

వంద సీట్లతో  మళ్లీ అధికారంలోకి వస్తం: టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
  •  
  • ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నరు: పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్
  • దళిత వాదంతోనే కాంగ్రెస్ ఆవిర్భవించింది
  • ప్రభుత్వంలో దళితులకు ఐదు కీలక పదవులు ఇచ్చామని వెల్లడి
  • ఎస్సీ సమాజం ఐక్యంగా ముందుకెళ్తేనే అభివృద్ధి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • గాంధీ భవన్​లో పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్​గా ఎమ్మెల్యే కవ్వంపల్లి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో వంద సీట్లతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణలో ఈ రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజా పాలనను జనం ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. అందుకే మరోసారి మంచి మెజార్టీతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. గురువారం గాంధీ భవన్ లో పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మహేశ్ గౌడ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని.. ఇక ఆ పార్టీ అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి చోటు లేదని, ఆ పార్టీని జనం ఆదరించరని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందే దళిత వాదంతో అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళితుడేనని, కాంగ్రెస్ తోనే ఇది సాధ్యమన్నారు. 

తెలంగాణలో 17 శాతం ఉన్న ఎస్సీలకు ప్రభుత్వంలో  ఐదు కీలక పదవులు ఇచ్చామని చెప్పారు. స్పీకర్, డిప్యూటీ సీఎంతో పాటు మూడు మంత్రి పదవులు దళితులకే ఇచ్చామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో భర్తీ చేయనున్న నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో దళిత, ఆదివాసీ, బడుగు బలహీన, మైనార్టీ వర్గాల వారికి తమ ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని అన్నారు. ఈ వర్గాలకు కాంగ్రెస్ మొదటి నుంచి అండగా ఉందన్నారు. క్లిష్ట సమయాల్లో కాంగ్రెస్ కు దళితులు అండగా నిలిచారని, వారు కాంగ్రెస్ ను ఆదరించిన తీరును మరిచిపోలేమని చెప్పారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిపోయారని ఆరోపించారు. దళితుడైన రాజయ్యను రాత్రికి రాత్రే డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించి దళితులను అవమానించారని, దీన్ని దళితులు మరిచిపోలేదని, అయినా జరిగిన తీరును తాను మరోసారి గుర్తు చేస్తున్నానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ను  శక్తివంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కవ్వంపల్లి సత్యనారాయణకు చైర్మన్ బాధ్యతలు అప్పగించామని పీసీసీ చీఫ్ చెప్పారు. బరువైన బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వర్తిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఎస్సీ సమాజం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా:  కవ్వంపల్లి 

ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వడంతోనే ఎమ్మెల్యే అయ్యానని, ఇప్పుడు ఆయన ప్రోత్సాహంతోనే ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు చేపడుతున్నానని చెప్పారు. సీఎం సహకారంతో ఎస్సీ సమాజం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. తమ తండ్రి వెంకటస్వామి ఆశీర్వాదంతోనే తాను, తన తమ్ముడు వివేక్ పదవుల్లో ఉన్నామని చెప్పారు. జనాభా ప్రాతిపదికన మన హక్కులను పొందాలని అన్నారు. ఐక్యతతోనే అభివృద్ధి చెందుతామని ఎస్సీ నేతలకు వినో ద్ సూచించారు. ఈ ప్రోగ్రాంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం, లక్ష్మికాంతం, నాగరాజు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఇతర నేతలు పాల్గొన్నారు.  


కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉంది: మంత్రి వివేక్

రాష్ట్రంలో ఎస్సీ సమాజం ఐక్యంగా ముందుకు సాగితేనే అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కవ్వంపల్లిని మంత్రి వివేక్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కవ్వంపల్లిపై పెద్ద బాధ్యత ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఎస్సీ సమాజం సమగ్ర అభివృద్ధి కోసం వినియోగించాలని మంత్రి కోరారు. తెలంగాణలో ఎస్సీ జనాభాకు తగ్గట్టుగా వ్యాపార, కాంట్రాక్టు రంగాల్లో, ఇతర రంగాల్లో అవకాశాలు కల్పించాలన్నారు. దళితులు ఆర్థిక అభివృద్ధి సాధిస్తేనే కుల వివక్షను పూర్తిగా అధిగమించగలమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో, పలు కార్పొరేషన్ పదవుల్లో దళితులకు సముచితమైన ప్రాధాన్యం దక్కేలా ఎస్సీ నాయకులంతా కృషి చేయాలని మంత్రి వివేక్ కోరారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులే కారణమని, ఎస్సీసెల్ కాంగ్రెస్ కు గుండె కాయలాంటిదన్నారు. తనకు మంత్రి పదవి రావడానికి ఎమ్మెల్యే మందుల సామేల్ కారణమన్నారు.