హైదరాబాద్: కాంగ్రెస్ చేవెళ్ల డిక్లరేషన్‌పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం (మే 26) కామారెడ్డిలో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసింది ఎవరో ప్రజలకు తెలుసని.. హరీష్ రావు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత వర్గాలకు స్పీకర్‌తో పాటు నాలుగు మంత్రి పదవులు ఇచ్చామని.. చేవెళ్ల డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ భరోసా యాత్రని చూసి రైతులు నవ్వుకుంటున్నారన్నారు. వరి వేయొద్దు.. వరి వేస్తే ఉరి అన్న బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి రైతుల దగ్గరకి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ALSO READ : నీటి మీద రాజకీయాలు చేయొద్దు..
ఈ సీజన్లో75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రం 52 లక్షలు మెట్రిక్ టన్నుల ధ్యానం సేకరణకు సహకారం అందిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇక, కొన్ని మీడియా ఛానెళ్లలో తనపై వచ్చిన వ్యతిరేక కథనాలు ముగిసిన అధ్యామని వ్యాఖ్యానించారు.
