- టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
నిజామాబాద్, వెలుగు : బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్‌లోకి లొంగిపోయిన మాయిస్టులను ఆహ్వానిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. పేదల పక్షాన తమకున్న ఆకాంక్షలు నెరవేర్చుకోడానికి కాంగ్రెస్ మంచి ప్లాట్‌ఫామ్ అవుతుందన్నారు. సోమవారం నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రతి వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సిందేనన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. కొందరు వ్యక్తులు స్వార్థంతో రాజకీయాల్లోకి వస్తున్నారని అలాంటి వారితో రాజకీయాలు కలుషితం అవుతున్నాయన్నారు. యువకులు సైతం ధనార్జనే ధ్యేయంగా పాలిటిక్స్‌లోకి రావడం బాధాకరం అన్నారు.
ఈ సమస్య అన్ని పార్టీల్లో ఉందని, దీని ప్రక్షాళనపై ఫోకస్ పెట్టాలన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ పేదలకు ఇచ్చిన మాట నెరవేర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ పథకాలను అమలు చేస్తోందన్నారు. అనంతరం స్థానిక బస్వా గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రెస్‌క్లబ్ కమిటీ ప్రమాణస్వీకారానికి హాజరై మాట్లాడారు. జర్నలిస్టులు వాస్తవాలు రాయాలి కానీ.. అసత్యాలు ప్రచారం చేస్తే వృత్తి గౌరవం పోతుందన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇండ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సాయంత్రం ఖిల్లా రోడ్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, మేయర్ ఉమారాణి, లైబ్రరీ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి ఉన్నారు.
