
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అసలు తెలంగాణలో కొనసాగే అర్హతే లేదని, ఆయన ఏపీ కేడర్‌కు చెందిన అధికారి అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం ఆయన సీఎం కేసీఆర్ ఎలా చెబితే అలా చేస్తున్నారనే సీఎస్ పదవి ఇచ్చారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఆయన ఎనిమిదేండ్ల పాటు సర్వీస్‌లో లేకుండా వెళ్లి.. బయట ఉద్యోగం చేసుకున్నాడని, అలా వెళ్లిన వ్యక్తికి సీఎస్ పదవి పొందే సీనియారిటీ ఎక్కడిదని ప్రశ్నించారు. సర్వీస్‌లో నుంచి ఆ ఎనిమిది సంవత్సరాలను తొలగించాలని, అటువంటప్పుడు సోమేశ్ కుమార్‌కు సీఎస్ అయ్యే అర్హత ఎలా వచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసలు తెలంగాణలో కొనసాగే అర్హతే లేని వ్యక్తికి సీఎం కేసీఆర్ సీఎస్ పదవి ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అన్ని శాఖల బాధ్యతలనూ అప్పగించారని అన్నారు. ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ, సీసీఎల్‌ఏ, జీఎస్టీ కమిషనర్.. ఇలా కీలక బాధ్యతలన్నీ సోమేశ్ దగ్గరే ఉన్నాయని చెప్పారు. గతంలో సోమేశ్ కుమార్‌పై కోర్టులో కేసు ఉంటే, దానికి సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిందని, ఆ కేసు ఫైల్ ఎలా మాయం అయిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కోకాపేట భూకుంభకోణంలోనూ సీఎస్ సోమేశ్ కుమార్ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. భూములు కొన్నవాళ్లంతా కేసీఆర్ బినామీలేనని, ఇతరులు భూముల టెండర్‌లో పాల్గొనకుండా కొందరు ఉన్నతాధికారులు బెదిరించారని, దీనికి సంబంధించిన ఆధారాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించి సీబీఐ ఎంక్వైరీ కోరుతానని రేవంత్ చెప్పారు.