రాష్ట్రం నాశనమవుతుంటే మేధావులు ఏం చేస్తున్నారు: రేవంత్​రెడ్డి​

రాష్ట్రం నాశనమవుతుంటే మేధావులు ఏం చేస్తున్నారు: రేవంత్​రెడ్డి​

కామారెడ్డి, వెలుగు: తెలంగాణ సర్వనాశనం అవుతుంటే మేధావులు, బుద్ధిజీవులు, ఉద్యమకారులు ఎక్కడికి పోయారని పీసీసీ చీఫ్​​ రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. దేశంలో  నరేంద్ర మోడీ,  రాష్ట్రంలో కేసీఆర్​ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం మేనూర్​​ వద్ద జరిగిన బహిరంగ సభలో రేవంత్  మాట్లాడుతూ..‘‘తెలంగాణ ఉద్యమకారులను అడుగుతున్నా.. ఏ అభివృద్ధి కోసం మనం రాష్ట్రం సాధించుకున్నామో  8 ఏండ్ల కేసీఆర్​ పాలనలో సిద్ధించాయా? యూనివర్సిటీల విద్యార్థులను అడుగుతున్నా... ఎందరో పోరాట యోధులను, ఉద్యమకారులను  యూనివర్సిటీలు అందించా యి. ఈ రోజు తెలంగాణలో అరాచకం జరుగుతుంటే.. రాచరిక పోకడలు పోతుంటే.. కేసీఆర్​ పాలనను తుదముట్టించేందుకు విద్యార్థులు ఎందుకు నడుం బిగించటం లేదు?” అని ప్రశ్నించారు.

బంగారు భవిష్యత్తు ఉంటుందని ఉన్నత చదువులు చదివితే ఉద్యోగాలు రావడం లేదని తెలిపారు. ‘‘అమరవీరుల కోసం, రైతుల కోసం, తెలంగాణ  సమాజం కోసం త్యాగాలు చేసిన బిడ్డలను మరిచిపోయారా?  రాచకంగా బీజేపీ, కేసీఆర్​ ఫ్యామిలీ తెలంగాణపై  దాడులు చేస్తే  అమరులు మనకు గుర్తుకు రావట్లేదా? మేధావులు ఎక్కడికి పోయారు.. నిద్రపోయారా.. లేదా అమ్ముడుపోయారా? తెలంగాణ సర్వనాశనం అవుతుంటే ఎందుకు స్పందించడం లేదు. అమరుల స్ఫూర్తితో పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద లేదా?” అని అన్నారు. సాధారణ జీవితం గడుపుతూ, గవర్నమెంట్​ క్వార్టర్​లో ఉంటున్న  రాహుల్​గాంధీ  ఫ్యామిలీపై  అవినీతి ఆరోపణలు ఏమిటని ప్రశ్నించారు.

రాహుల్​ ఫ్యామిలీపై ఏవరు అవినీతి ఆరోపణలు చేసిన ఏడమ కాలి చెప్పుతో కొట్టాలని రేవంత్​ అన్నారు. సీఎల్సీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారత్​ జోడో పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నేతలు  షబ్బీర్​అలీ,  మధుయాష్కీ మాట్లాడారు.  కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, నేతలు  దిగ్విజయ్​సింగ్, వేణుగోపాల్,  ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్​బాబు, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.