మా డేటాను పోలీసులు ఎత్కపోయిన్రు : రేవంత్ రెడ్డి

మా డేటాను పోలీసులు ఎత్కపోయిన్రు : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ లో పోలీసులు దాడులు చేయడాన్ని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థలను ధ్వంసం చేయడమే అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై రైడ్ చేసి..అందులోని సిబ్బందిని ఎత్తుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్ రూమ్ లోని 50 కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని చెప్పారు.  

మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్ తో సహా పలువురు నేతలు ప్రశ్నిస్తే ..సునీల్ కనుగోలును అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పారు. వార్ రూమ్ సిబ్బందిని దౌర్జన్యంగా రౌడీ మూకల మాదిరిగా పోలీస్ వాహనాల్లో తీసుకెళ్లారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని ఎక్కడ దాచారో తెలియడం లేదన్నారు. డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులకు  ఫోన్లు చేసినా  స్పందించడం లేదని మండిపడ్డారు. 

ఫిర్యాదుకు సంబంధించిన ఎఫైర్ వారెంట్ ఏమీ చూపించకుండా సునీల్ కనుగోలును అరెస్ట్ చేసేందుకు వచ్చామని సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేయడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో సేకరించిన తమ డేటాను పోలీసులు ఎత్తుకుపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ అల్లరి మూకల మాదిరిగా, కిరాయి గూండాల్లాగా పోలీసులు దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేసీఆర్ ఓడిపోతారనే  భయంతో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఆఫీస్ పై దాడులు చేశారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ నేతలు వారెంట్ చూపించమంటే పోలీసులు చూపించలేదన్నారు. అసలు వీళ్లు పోలీసులా? దొంగలా అనే అనుమానం కల్గుతుందని రేవంత్ మండిపడ్డారు. 

దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని.. పాదయాత్రలో ఆయన లేవనెత్తుతున్న అంశాలు నచ్చకనే నరేంద్ర మోడీకి , కేసీఆర్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.ఈఅంశంపైపార్లమెంట్ లో మాట్లాడుతామని...దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్  ఆగడాలను దేశ ప్రజలకు తెలియజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర పోలీసులు ఉల్లంఘించారు

సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర పోలీసులు ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటోందన్న విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందన్నారు. కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ ఉందని ఒక ఫేస్ బుక్ పోస్ట్ పెట్టామని..ఆ పోస్టు వల్ల పోలీసులకు కలిగిన ఇబ్బంది ఏంటో అర్థం కాలేదన్నారు.