
మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని బీఆర్ఎస్ లో చేర్చుకుని సీఎంఓలో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహారాష్ట్రకు చెందిన శరత్ మర్కట్ ను ఇటీవల బీఆర్ఎస్ లో చేర్పించుకున్న కేసీఆర్.. సీఎం కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని ఆరోపించారు. అతడికి నెలకు లక్షా యాభై వేల జీతం ఇచ్చి ప్రైవేట్ సెక్రటరీగా పెట్టుకున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. ఈ జీవో పబ్లిక్ డొమైన్ లో ఎక్కడా లేదని చెప్పారు. పరాయి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ కోసం ప్రజల సొమ్మును వినియోగిస్తుండని విమర్శించారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లయినా ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ మహారాష్ట్రకు చెందిన వాళ్లకు జాబులిస్తుండని ధ్వజమెత్తారు రేవంత్. జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
మహారాష్ట్రకు చెందిన వారు బీఆర్ఎస్ లో చేరుతున్నారనేది ఓ నాటకమని విమర్శించారు రేవంత్. కిరాయి మనుషులను రప్పించి రోజుకో వేషం వేయించి పార్టీలో చేర్పించుకుంటున్నారని అన్నారు. పగటి వేషగాళ్లను రప్పించి బీఆర్ఎస్ లో భారీగా చేరుతున్నారనే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి కర్ణాటకలో బీజేపీని ఓడగొట్టాలని చెప్పాలన్నారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్లను మార్కెట్లో అమ్ముకున్నారని ఆరోపించారు రేవంత్. తొమ్మిదేళ్లలో సర్కార్ అన్నింట్లో విఫలం అయ్యిందన్నారు. ప్రశ్నాపత్రాలు జిరాక్స్ షాపుల్లో దొరుకుతున్నాయన్నారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రైతులు నష్టపోతే కనీసం ఆదుకోవడం లేదన్నారు. కేసీఆర్ రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టారని పండించిన పంట,తడిసి ధాన్యం కొనట్లేదని విమర్శించారు. మే 8న సరూర్ నగర్లో జరగనున్న నిరుద్యోగ మార్చ్ ను విజయవంత చేయాలని పిలుపునిచ్చారు.