రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో

రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..  సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ  విమోచన దినోత్సవం రోజున (సెప్టెంబర్ 17)న  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని వెల్లడించారు.  అక్టోబర్ 2 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని హోటల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదిన కానుకగా కాంగ్రెస్ గెలుపును అందిద్దామని అన్నారు. పోరాడే వారికి పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.  రాజకీయ భవిష్యత్‌కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని చెప్పారు. ఇక  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక  ధరణి పోర్టల్ ను  పూర్తిగా ఎత్తివేస్తామని చెప్పారు. 97 శాతం భూవివాదాలకు ధరణ పోర్టలే కారణమని చెప్పారు.

బినామీల పేరిట సీఎం కేసీఆర్  వేల ఎకరాలను కొట్టేశారని రేవంత్ ఆరోపించారు.  ప్రస్తుతం ధరణి పోర్టల్ ప్రభుత్వం ఆధీనంలో లేదన్న రేవంత్ దళారుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ధరణ రద్దుతో పాటుగా ఇందులో జరిగిన అవకతవకలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. దొరల కోసమే ధరణి పోర్టల్అని రేవంత్ విమర్శించారు.  

డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని అని రేవంత్ రెడ్డి అన్నారు. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని అని.. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా అని ఆరోపించారు.  బీజేపీ  కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పై చేసే పోరాటంలో గెలవాలంటే యువత ముందుండాలన్న రేవంత్ .. పచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించాలని కార్యకర్తలకు సూచించారు.