
హైదరాబాద్: త్యాగాల కుటుంబమైన గాంధీ కుటుంబాన్ని అవమానిస్తే ఊరుకునేదే లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. ఇందుకు నిరసనగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసిన పత్రిక నేషనల్ హెరాల్డ్ అన్నారు. 1937లో నేషనల్ హెరాల్డ్ పత్రికను జవహార్‌లాల్ నెహ్రూ ప్రారంభించారని.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు గాంధీ, పటేల్, నెహ్రూ మూలస్తంభాలుగా నిలిచారని తెలిపారు. నష్టాల్లో ఉన్నప్పుడు నేషనల్ హెరాల్డ్ పత్రికను రాహుల్ ఆదుకున్నారని.. రూ. 90కోట్ల అప్పుల్లో ఉన్నదాన్ని తిరిగి ఓపెన్ చేశారని చెప్పారు. బీజేపీ అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న పత్రికపై .. అక్రమాలు జరిగాయని నోటీసులు ఇచ్చారన్నారు. సుబ్రమణ్య స్వామి ఈడీగా ఉన్న సమయంలో.. ఇందులో ఏమి జరగలేదని రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. మళ్లీ దాన్ని రీ ఓపెన్ చేసింది మోడీ సర్కారే అన్నారు. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని..కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే భయంతోనే మోడీ నోటీసులు పంపారని చెప్పారు. పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని..వచ్చే ఎన్నికల్లో మోడీకి స్వస్తి చెప్పాలని చూస్తున్నారని తెలిపారు.
త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం..
దేశ సమగ్రతను కాపాడాలంటే ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యం అన్నారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా.. ప్రజల కోసం త్యాగం చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ ఫ్యామిలీకి డబ్బే కావాలంటే .. దేశ కాంగ్రెస్ కార్యకర్తలే చందాలేసుకుని గాంధీ కుటుంబాన్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నిజంగానే గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరంలేదని.. ప్రజాసేవనే వారు కోరుకునేదన్నారు. రాహుల్ కు 50లక్షలు కాదు..5వేల కోట్లు కావాలన్నా 24గంటల్లో కాంగ్రెస్ అభిమానులు ఇవ్వగలరని.. గాంధీ కుటుంబానికి ఆస్తులు, పదవులు అక్కరలేదన్నారు. అన్ని రాష్ట్రాలలోను ఈడీ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతున్నామని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిది అన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హయాంలో విఫరీతంగా ధరలు పెరుగుతున్నాయని, పెట్రో మంట, గ్యాస్ గుబులు, నిత్యావసర ధరలు చెప్పుకుంటూ పోతే అన్నీ పెరుగుతూ వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
చరిత్ర రిపీట్ కాబోతుంది..
1977లో ఇందిరా గాంధీని అవమానిస్తే ..1980లో జరిగిన ఎన్నికలో అద్భుతమైన మెజారిటీతో గెలిచిన ఇందిరా గాంధీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. ఇవాళ తేదీ గుర్తుపెట్టుకోవాలని 13-జూన్-2022న రాహుల్ గాంధీని అవమానించారని , ఇందుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లతో సమాదానం చెబుతారని చెప్పారు. 1980లో కూడా ఇందిరా గాంధీపై కేసు పెడితే.. తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలొకి వచ్చిందని.. జూన్ 23న సోనియా ఈడీ కార్యాలయంలో అడుగుపెడితే మోడీ పునాదులు కదుల్తాయ్ అన్నారు. గాంధీ కుటుంబం మీద ఈగ వాలినా రాజకీయంగా బతికి బట్టకట్టలేరని.. తెలంగాణ కళ సాకారం చేసిన దేవత సోనియా అన్నారు. తెలంగాణ తల్లి సోనియాను ఈడీ ఆఫీస్ కు పిలుస్తే ఉరుకుంటామా.. గాంధీ వారసులం కాబట్టి శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ సంఘటనతో కాంగ్రెస్ కు సానుభూతి పెరుగుతుందని, అధికారంలోని వచ్చాక ఎవ్వరినీ వదలమన్నారు. సోనియాగాంధీని అవమానించిన వారికి తగిన బద్ది చెబుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.