ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగిందేం లేదు

ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగిందేం లేదు

హైదరాబాద్, వెలుగు: ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలకు శబ్ద కాలుష్యం తప్ప బీజేపీ సమావేశాలతో ప్రజలకు ఒరిగింది శూన్యమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా యావత్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వస్తుంటే.. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి నిర్ధిష్ట ప్రణాళిక ప్రకటిస్తారని ఆశించామని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వారం రోజులుగా తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ వీధి నాటకాలు, ఫ్లెక్సీల గొడవలు, చిల్లర మల్లర పంచాయితీలు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. 3 ఏళ్లుగా కేసీఆర్ అవినీతిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడితోపాటు రాష్ట్ర పార్టీ నాయకులు హెచ్చరికలు చేయడం తప్ప ఒక్క అడుగు కూడా ఆ దిశగా పడలేదన్నారు.

సభ ప్రసంగాల్లో అధికార దాహం తప్ప తెలంగాణ త్యాగాల గురించి, అమరవీరుల త్యాగాల గురించి, ప్రొఫెసర్ జయశంకర్ సార్, శ్రీకాంతాచారి గురించి ప్రస్తావించకపోవడం బీజేపీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా తెలంగాణ గడ్డ మీద నుంచే అమిత్ షా మాట్లడటం దుస్సాహసమన్నారు. దీనికి మోడీ, అమిత్ షా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన మాత్రమే శ్రీరామ రక్ష అని, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు వీడ్కోలు పలకడమే మిగిలి ఉందని రేవంత్ అన్నారు.