ఇద్దరూ జేబు దొంగలే.. వీళ్ల ఫొటోలు పోలీస్‌స్టేషన్, బస్టాండ్‌లలో పెట్టాలె

ఇద్దరూ జేబు దొంగలే.. వీళ్ల ఫొటోలు పోలీస్‌స్టేషన్, బస్టాండ్‌లలో పెట్టాలె

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌‌లపై పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరూ జేబు దొంగలేనని, ప్రజలను దోచుకుంటున్న వీళ్ల ఫొటోలను పోలీస్‌ స్టేషన్, బస్టాండ్‌లలో పెట్టాలని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన చలో రాజ్‌భవన్ నిరసన కార్యక్రమం సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, మోసం చేసి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారని ఆరోపించారు. ఏడేండ్ల పాలనలో తెలంగాణలోని ఏ వర్గం సంతోషంగా లేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రధాని మోడీ ప్రజల నుంచి రూ.36 లక్షల కోట్లు కొట్టేశారని ఆరోపించారు. కేసీఆర్, మోడీ ఇద్దరూ జేబు దొంగలేనని, ప్రజలను దోపిడీ చేస్తున్న ఈ ఇద్దరి ఫొటోలను పోలీస్ స్టేషన్లు, బస్‌స్టాండ్‌లలో పెట్టాలని రేవంత్ అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై 65 రూపాయలను అదనంగా ప్రజల నుంచి గుంజుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఇంత దోపిడీ ఎక్కడ లేదని, మన దేశంలోనే పెట్రోల్ ధరలపై ఈ స్థాయి దోపిడీ జరుగుతోందని చెప్పారు. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే పెట్రోల్ కు ఎక్కువ ధర ఉందన్నారు. శత్రుదేశం పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్‌ రూ.53 ఉందని చెప్పారు. పేదల బ్యాంక్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోడీ ఎన్నికల టైంలో చెప్పారని, ఆ హామీ ఏమైందని రేవత్ ప్రశ్నించారు.