మహిళా రిజర్వేషన్ల ముసుగులో ఉత్తరాది ఆధిపత్యాన్ని రుద్దాలని చూసిన ఎన్డీఏ కుయుక్తులకు పార్లమెంట్ సాక్షిగా చెక్ పడింది. డీలిమిటేషన్ పేరిట దక్షిణాది గొంతునొక్కే ప్రయత్నం కుప్పకూలింది. ఇది కేవలం ఒక బిల్లు ఓటమి కాదు.. సమాఖ్య స్ఫూర్తికి లభించిన గొప్ప విజయం. పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్ సరళిని గమనిస్తే, ఎన్డీఏ పతనం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్న ఈ చారిత్రాత్మక ఘట్టంలో అవసరమైన మెజారిటీ 352 ఓట్లు కాగా బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు బిల్లుకు వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి.
నిర్దేశించిన రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 మెజారిటీ సాధించలేక బిల్లు వీగిపోవడం అంటే, అది ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే సొంత మిత్రపక్షాల నుంచే మద్దతు లభించదని ఈ ఫలితం నిరూపించింది. భారత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అనేది సహజ ప్రక్రియే అయినా, ప్రస్తుతం దాని తీసుకువచ్చిన ఎన్డీఏ వెనుక దాగి ఉన్న రాజకీయ విద్వేషం భయంకరమైనది.
రేవంత్ రెడ్డి సమర శంఖం.. రాహుల్ గాంధీ దార్శనికత
ఈ పోరాటంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ‘దక్షిణాది చెమట చుక్కలతో ఉత్తరాది అభివృద్ధి చెందుతోంది. కానీ, రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని చూస్తారా?’ అని రేవంత్ రెడ్డి గర్జించడం దక్షిణాది ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో పాటు పుదుచ్చేరి సీఎంకు కూడా డీలిమీటేషన్పై ఎన్డీఏ చేస్తున్న కుట్రను వివరించి, మద్దతు కూడగట్టారు.
రాహుల్ గాంధీ ఈ అంశాన్ని కేవలం రాజకీయంగానే కాకుండా, సామాజిక న్యాయకోణంలో విశ్లేషించారు. కులగణన జరగకుండా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ చేసే డీలిమిటేషన్ అప్రజాస్వామికమని ఆయన బలంగా నొక్కి చెప్పారు.
కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంలో చాలా స్పష్టమైన వ్యూహంతో ముందుకువెళ్లింది. మహిళా రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు అమలు చేయాలని డిమాండ్ చేసింది. అది పక్కన పెట్టి.. సవరణ పేరుతో డిలిమీటేషన్కు రిజర్వేషన్ల బిల్లు లింక్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను ఏకం చేసి, అంకెల గారడీతో నెట్టుకొద్దామనుకున్న ఎన్డీఏకు షాక్ ఇచ్చింది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెప్పే మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తనకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు, దేశ సమైక్యత ముఖ్యమని చెప్పిన సందర్భం గెలిచింది.
దక్షిణాది రాజకీయ ప్రాబల్యాన్ని శాశ్వతంగా సమాధి చేయాలనే వ్యూహం
1970ల నుంచి కుటుంబ నియంత్రణ పాటించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. ఈ డీలిమిటేషన్ వెనుక ఉన్న అసలు ప్రమాదాన్ని గణాంకాలతో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. జనాభా ప్రాతిపదికన 50 శాతం సీట్ల పెంపు చేపడితే, ఇప్పటికే రాజకీయంగా చక్రం తిప్పుతున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం అమాంతం పెరిగిపోతుంది. ప్రస్తుతం 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 50 శాతం పెంపుతో ఆ సంఖ్య 120కి చేరుతుంది. అదే సమయంలో తెలంగాణ సీట్లు 17 నుంచి కేవలం 26కు మాత్రమే పెరుగుతాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, తెలంగాణ మధ్య ఉన్న సీట్ల గ్యాప్ 63 కాగా, డీలిమిటేషన్ తర్వాత అది ఏకంగా 94కు చేరుతుంది.
అంటే, అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంట్‌లో తమ ప్రాధాన్యతను కోల్పోయి, కేవలం ఉత్తరాది రాష్ట్రాల నిర్ణయాలపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. జనాభా పెంచుకున్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, అదుపు చేసి, అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా దక్షిణాది రాజకీయ ప్రాబల్యాన్ని శాశ్వతంగా సమాధి చేయాలనేది కేంద్రంలోని ఎన్డీఏ కూటమి వ్యూహం. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే డీలిమిటేషన్ తప్పనిసరి అనే నిబంధన పెట్టడమే ఒక పెద్ద మోసం. మహిళలకు హక్కులు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే, ఈపాటికే అవి అమలుకావాలి. కానీ,
ఆ నెపంతో దక్షిణాదిపై ‘ఉత్తరాది పెత్తనాన్ని’ రుద్దాలని చూడటమే అసలు కుట్ర.
ఢిల్లీ సుల్తానుల ముందు దక్షిణాది తలవంచదు
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు స్తంభింపజేశారు. ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం దానిని 2026 వరకు పొడిగించింది. దీని ఉద్దేశం ఒక్కటే.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు నష్టపోకూడదు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఆ నైతికతను విస్మరించి, మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో డిలీమిటేషన్ పేరిట కేవలం సీట్ల సంఖ్య పెంచుకుని అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే దురాశతో వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలు దేశ జీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.
అటువంటి రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం అంటే దేశ సమగ్రతను దెబ్బతీయడమే. ఈ బిల్లు ఓటమి కేవలం సంఖ్యాపరమైన విజయం కాదు, ఇది నైతిక విజయం. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా ‘ఢిల్లీ సుల్తానుల ముందు దక్షిణాది తలవంచదు’ అనే సందేశం బలంగా వెళ్ళింది. ఇకనైనా కేంద్రం మొండివైఖరి వీడి, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా నేరుగా అమలు చేయాలి. రాష్ట్రాల హక్కులను గౌరవించే సమాఖ్య వ్యవస్థకు ఈ తీర్పు ఒక దిక్సూచి.
దూడం వెంకటరమణ, టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ డీలిమిటెషన్ కమిటీ మెంబర్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.

