కేసీఆర్ పీఠం కదులుతున్నది.. అందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్: రేవంత్ 

కేసీఆర్ పీఠం కదులుతున్నది.. అందుకే కేటీఆర్ ఢిల్లీ టూర్: రేవంత్ 
  • ఐటీ రెయిడ్స్ వల్లనే కేంద్ర మంత్రులతో భేటీ.. ఆస్తులను విడిపించుకునేందుకు ప్రయత్నం 
  • లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్​ను కేంద్రం ఎందుకు జైల్లో పెడ్తలేదని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ పీఠం కదులుతున్నదని, అందుకే మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్​కు వెళ్లారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ వెళ్లి గల్లీగల్లీలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్​, బీజేపీ నేతలు జూబ్లీహిల్స్​లోని రేవంత్ ఇంట్లో కాంగ్రెస్​కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కేటీఆర్ ఢిల్లీ టూర్ తెలంగాణ అభివృద్ధి కోసం కాదు. కంటోన్మెంట్​లో రోడ్ల నిర్మాణం కోసం కాదు. హైవేలు, ఇరిగేషన్​ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం కానే కాదు. బీఆర్‌‌‌‌ఎస్ నేతలపై ఐటీ రెయిడ్స్ జరుగుతుండడంతోనే ఆయన ఢిల్లీకి పోయిండు.‌‌‌‌ రెయిడ్స్ జరిగిన కంపెనీల్లో కేటీఆర్‌‌‌‌కు చెందినవి కూడా ఉన్నయ్.‌‌‌‌ మీడియాను మేనేజ్ చేసి అది బయటకు రానివ్వలేదు.‌‌‌‌ ఆ కేసు మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు, ఆస్తులను విడిపించుకునేందుకే కేటీఆర్​ఢిల్లీకి పొయ్యి కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నడు’’ అని రేవంత్ చెప్పారు. 

దోచుకున్న సొమ్ముతో కేసీఆర్ పారిపోతడు.. 

పదేండ్లలో సీఎం కేసీఆర్​రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, అయినా ఆయనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు జైల్లో పెట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు. ‘‘లిక్కర్​స్కామ్​లో వంద కోట్ల ముడుపులు తీసుకున్నారని కేజ్రీవాల్ ప్రభుత్వంలోని మంత్రులను జైలుకు పంపారు. కేజ్రీవాల్​కూ నోటీసులిచ్చారు. అలాంటప్పుడు కేసీఆర్‌‌‌‌ మంత్రులు, బీఆర్‌‌‌‌ఎస్ నేతలపైనా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు. బీఆర్‌‌‌‌ఎస్, బీజేపీ ఒక్కటేనని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినా ప్రయోజనం ఉండదన్నారు. కేసీఆర్ చీడ పీడను వదిలించే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని.. కాంగ్రెస్‌‌‌‌తో కలిసి పోరాడేందుకు ఆ నేతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

‘‘రాష్ట్రంలో జరిగిన ఐటీ రెయిడ్స్​లో ఒక్కరినైనా అరెస్టు చేశారా? బీఆర్ఎస్ లీడర్ల మెడికల్​కాలేజీల్లో సోదాలు చేసినప్పటికీ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా?” అని ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్​కు ఏటీఎంలా మారిందని పదే పదే ఆరోపిస్తున్న బీజేపీ నేతలు.. చర్యలు మాత్రం ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ‘‘రాష్ట్రంలో రోడ్లను కూడా అమ్ముకునే పరిస్థితి కేసీఆర్​తీసుకొచ్చారు. ఓఆర్ఆర్​ను ముంబై కంపెనీకి అమ్ముకున్నారు. కేసీఆర్​కు దుబాయ్​అంటే చాలా ఇష్టం. దోచుకున్న సొమ్ముతో అక్కడికి పారిపోతారు” అని అన్నారు.