కేసీఆర్ కు రాజకీయాలు తప్ప వరదలు పట్టడం లేదు

కేసీఆర్ కు రాజకీయాలు తప్ప వరదలు పట్టడం లేదు

భారీ వర్షాలు వస్తాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు రాజకీయాలు తప్ప వరదలు పట్టడం లేదని విమర్శించారు. కాళేశ్వరం పూర్తిగా అవినీతికి బలైపోయిందని..వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిందన్నారు. మూడు నాలుగేళ్లు నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి వచ్చిందన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని లక్షా 40వేల కోట్లకు పెంచి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. డిజైన్ల లోపం, నిర్లక్ష్యం, అవినీతి వల్లే కాళేశ్వరానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. 

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. కరెంట్, రోడ్ల మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ప్రజలకు నిత్యావసరాలు అందజేయాలని చెప్పారు. కేంద్రానికి నివేదిక పంపి తక్షణ సాయం కోరాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని, హోంమంత్రిలకు రాష్ట్ర పరిస్థితిని వివరించి వారిని రాష్ట్రంలో పర్యటించేలా చూడాలన్నారు. కేంద్రం వెంటనే రాష్ట్రానికి సాయం అందించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో రాహుల్ పాదయాత్ర

తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని రాయచూర్ మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వద్ద తెలంగాణలోకి ఎంటర్ అవుతుందని చెప్పారు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ కు రాహుల్ పాదయాత్ర సాగుతుందని తెలిపారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారని వెల్లడించారు.