మా అపాయింటెడ్ డేను ప్రకటించండి.. సర్కారుకు పంచాయతీ సెక్రటరీల వినతి

 మా అపాయింటెడ్ డేను ప్రకటించండి.. సర్కారుకు పంచాయతీ సెక్రటరీల వినతి

హైదరాబాద్, వెలుగు: గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీల అపాయింటెడ్ డేను ప్రకటించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్(టీపీఎస్ఎఫ్) నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నాలుగేండ్ల నుంచి రాష్ట్రంలో పనిచేస్తున్న 8 వేల మందిని గ్రేడ్– 4 గా రెగ్యులర్ చేశారని.. అయితే, ఇంతవరకు తమ సర్వీస్ ఎప్పటి నుంచి లెక్కిస్తారో పంచాయతీ రాజ్ శాఖ చెప్పలేదని ఫెడరేషన్  ​ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

ఆదివారం ఖైరతాబాద్ లోని రంగారెడ్డి జడ్పీ హాల్ లో టీపీఎస్ ఎఫ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్​శ్రీకాంత్​గౌడ్​ మాట్లాడుతూ.. ఇటీవల 53 సంఘాలతో ఏర్పాటు చేసిన ఉద్యోగుల జేఏసీలో సెక్రటరీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని టీఎన్జీవో, టీజీవో నేతలను ఆయన కోరారు. ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరిన తొలి రోజు నుంచి సర్వీస్ ని కౌంట్ చేస్తూ, జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా తీసుకోవాలని, ఓపీఎస్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. స్పోర్ట్స్ కోటాలో తొలగించిన 98 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు.