హైదరాబాద్ - వెలుగు: ఎంప్లాయీస్ హెల్త్ స్కీము(ఈహెచ్ఎస్)కు సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన విధివిధానాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాతే జేఏసీ ఒప్పందం ప్రకారం ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్ వసూలు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్ కుమార్, నన్నెబోయిన తిరుపతి కోరారు.
హైదరాబాద్‌లో గురువారం టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. రాష్ట్రంలో కొత్త పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలని, ఐదు డీఏలను కొత్త పీఆర్సీలో సవరించబడే శాతం మేరకు చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ పొందిన టీచర్లకు రావాల్సిన పెన్షన్ సొమ్మును, గత రెండేండ్ల టెన్త్ స్పాట్ రెమ్యూనరేషన్ నూ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సెన్సస్ విధులతో టీచర్లు బిజీగా ఉన్నందున సర్వీసు రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే గడువును జూన్ 30 వరకు పొడిగించాలని కోరారు.
రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించి.. వాటిని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నేతలు తిరుపతి రెడ్డి, రవీందర్, నారాయణమ్మ, శ్రీనివాస్, లక్ష్మయ్య యాదవ్, రాజు, కార్యదర్శులు రమేశ్, విజయ్, రాజయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు.
