- ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
ముషీరాబాద్, వెలుగు: హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా వంతెన కూల్చివేత, పునర్నిర్మాణ పనుల వల్ల నేటి నుంచి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి. జోయల్ డేవిస్ తెలిపారు. అశోక్ నగర్ చౌరస్తా, అరవింద్ నగర్, నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జి కింద ఉన్న పిల్లర్ నంబర్ 16, 17 మధ్య రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 9 నుంచి ఇందిరాపార్క్ వైపు వెళ్లే వాహనాలను అశోక్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద మళ్లిస్తారు. ఈ వాహనాలు అశోక్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం, బాకారం బ్రిడ్జి, ఎల్ఐసీ కాలనీ, బండ మైసమ్మ ఎక్స్ రోడ్, ధర్నా చౌక్ మీదుగా ఇందిరాపార్క్ చేరుకోవాలని పోలీసులు సూచించారు. ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చన్నారు.
