హైదరాబాద్ సిటీ, వెలుగు: ట్రాఫిక్ నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ట్రాఫిక్ సమిట్‌కు గురువారం ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. రెండ్రోజుల సదస్సులో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు, సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు, టెక్నాలజీ సమన్వయం వంటి అంశాలపై చర్చిస్తున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మన దేశంలో రోడ్లు వేగంగా విస్తరిస్తున్నాయని, గత దశాబ్దంలో జాతీయ రహదారులు 60 శాతం వరకు విస్తరించాయని చెప్పారు. ఫ్లైఓవర్లు, మెట్రో రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు మన ప్రగతికి నిదర్శనమని, అయినప్పటికీ భద్రత అత్యున్నత ప్రాధాన్యతాంశంగా చూడాలన్నారు.
త్రిపురలో నడిచి తిరిగేవాడిని..
ఈ సందర్భంగా గవర్నర్తన సొంత అనుభవాలను పంచుకున్నారు. త్రిపురలోని అగర్తలాలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో నగరమంతా నడిచి తిరిగేవాళ్లమని, కానీ.. ఇప్పుడు అక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ కనిపిస్తున్నాయని చెప్పారు. షిల్లాంగ్‌లోనూ అదే పరిస్థితి ఉందన్నారు. టెక్నాలజీ, ఏఐ, కెమెరాలను ఉపయోగించి ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. హెచ్‌సీఎస్‌సీని ప్రశంసిస్తూ.. పాత నగరం, కొత్త నగరం రెండూ సమానంగా అభివృద్ధి జరగాలన్నారు.
ఫస్ట్‌టైం కండక్ట్ చేస్తున్నం
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ..హెచ్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో తొలిసారిగా ట్రాఫిక్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, గతంలో నార్కోటిక్స్, విమెన్ సేఫ్టీ వంటి కార్యక్రమాలు చేశామని చెప్పారు. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నదని, హైదరాబాద్‌లో ఐటీ ఏరియా విస్తరణ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో కంజెక్షన్ ఎక్కువగా ఉందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), ఫ్లైఓవర్లు, మెట్రో ఉన్నప్పటికీ ట్రాఫిక్ పెరుగుతున్నదని, మెట్రో ఫేజ్2 త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు.
ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యూహాలు, వర్షపాతం ప్రభావం, ఆపరేషన్ రోప్ వంటి పరిష్కారాలు సాంకేతిక సమన్వయంతో అమలు చేస్తున్నామని వివరించారు. బెంగళూరు అనుభవాల నుంచి సూచనలు తీసుకొని ఇక్కడ అమలు చేశామని చెప్పారు. వర్షం పడితే ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పార్కింగ్, ఎంక్రోచ్మెంట్లు తొలగించి క్యారేజ్‌వే అందుబాటులో ఉంచాలని సూచించారు. వీఐపీ కాన్వాయ్‌లను సిగ్నల్ మేనేజ్మెంట్తో నియంత్రిస్తున్నామని, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలు, గూగుల్ టైఅప్‌తో ట్రాఫిక్ మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు ఇంజినీరింగ్ మార్పులు అమలు చేస్తున్నాయన్నారు. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అదనపు వేతనం ఇస్తున్నామని చెప్పారు. హెచ్‌సీఎస్‌సీ సహకారంతో 120 ట్రాఫిక్ మార్షల్‌లను నియమించామన్నారు. అపోలో దవాఖాన పరిసరాల్లో మార్షల్‌ల్స్ తో ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపడిందని చెప్పారు.
50 ట్రాఫిక్ బైక్‌లు కూడా అందించామని తెలిపారు. ఏఎస్సీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థల నుంచి నిపుణులు పాల్గొన్నారని, ఫస్ట్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ, రోడ్ సేఫ్టీ, సస్టైనబుల్ మొబిలిటీ వంటి అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు జరుగుతున్నాయని వివరించారు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ పాల్గొన్నారు.
హెల్మెట్ నన్ను కాపాడింది : సాయి ధరమ్‌తేజ్
హెచ్‌సీఎస్‌సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాఫిక్ సమ్మిట్‌కు సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ హాజరయ్యారు. తన జీవితంలో ఎదురైన బైక్ ప్రమాద అనుభవాన్ని పంచుకున్నారు. హెల్మెట్ తన ప్రాణాలను కాపాడిందన్నారు. ఆ ప్రమాదం తర్వాత తాను తన గొంతును, కాన్ఫిడెన్స్‌ను కోల్పోయానని, కానీ ఓర్పు, పట్టుదలతో వాటిని తిరిగి పొందానని గుర్తు చేశారు. ఈ అనుభవం తనకు జీవితంలో భద్రత ప్రాముఖ్యతను నేర్పిందని వివరించారు. రైడర్లందరూ హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. యువత ర్యాష్ డ్రైవింగ్, స్టంట్స్, సిగ్నల్స్ దాటడం చేయొద్దని కోరారు.
