హైదరాబాద్ సిటీ, వెలుగు: మొహర్రం సందర్భంగా నిర్వహించే పాతబస్తీలో బీబీ కా ఆలమ్ ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బీబీ కా అలవా, షేక్ ఫైజ్ కమాన్, ఏతేబార్ చౌక్, గుల్జార్ హౌజ్, చార్మినార్, మదీనా, సాలార్ జంగ్ రోటరీ, చాదర్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు. పాతబస్తీలో భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ఆర్టీసీ బస్సులను కూడా రంగమహల్, అఫ్జల్‌గంజ్ వైపునకు మళ్లించనున్నారు.
పాతబస్తీలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ పర్యటన మొహర్రం ఊరేగింపులకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ పాతబస్తీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గుల్జార్ హౌజ్ నుంచి చార్మినార్ వరకు కాలినడకన పర్యటించిన ఆయన కరెంట్లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, జంక్షన్ బాక్సులు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. కరెంట్పోకుండా ప్రత్యేక రిపేర్ టీంలు, వెహికల్స్, అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచాలన్నారు. తెగిపోయిన తీగలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
