రెండేండ్లుగా జీతం ఇవ్వట్లేదని..ప్రభుత్వ ఆఫీసు ముందే ఉద్యోగి ఆత్మహత్య

రెండేండ్లుగా జీతం ఇవ్వట్లేదని..ప్రభుత్వ ఆఫీసు ముందే ఉద్యోగి ఆత్మహత్య
  • కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలో విషాద ఘటన
  • సూసైడ్ నోట్ ఆధారంగా ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు

బెంగళూరు: కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. 27 నెలలుగా జీతం అందకపోగా, అధికారుల వేధింపులకు గురిచేస్తుండడంతో హొంగనూరు గ్రామ పంచాయతీలో వాటర్‍మ్యాన్‌‌‌‌గా పనిచేస్తున్న చికూస నాయక అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. గ్రామ పంచాయతీ ముందే బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

చికూస నాయక సూసైడ్ నోట్ ప్రకారం.."నేను 2016 నుంచి హొంగనూరు గ్రామంలో వాటర్‌‌‌‌మ్యాన్‌‌‌‌గా పనిచేస్తున్నాను. అయితే, 27 నెలలుగా నాకు జీతం ఇవ్వడం లేదు. పెండింగ్ జీతం కోసం పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీవో) రామే గౌడ, గ్రామ సర్పంచ్ భర్త మోహన్ కుమార్ ను ఎన్నిసార్లు అడిగినా వాళ్లు పట్టించుకోలేదు. పైగా నన్ను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలని వేధించేవారు.  

నేను సెలవు అడిగితే వేరే వ్యక్తిని పనిలో పెట్టి లీవ్ తీసుకోమని తీవ్ర మనోవేదనకు గురిచేశారు. పీడీవో రామే గౌడ, గ్రామ సర్పంచ్, ఆమె భర్త మోహన్ కుమార్ భర్త నన్ను మానసికంగా వేధిస్తున్నందుకే సూసైడ్ చేసుకుంటున్నాను. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని సూసైడ్ నోట్‌‌‌‌లో కోరాడు. ఈ నోట్‌‌‌‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

పీడీవో రమే గౌడ, గ్రామ సర్పంచ్, ఆమె భర్తపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా పంచాయతీ సీఈవో స్పందించి.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పీడీవో రామే గౌడను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు

ఈ ఘటనపై కర్నాటక బీజేపీ.. సిద్ధరామయ్య ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో మరో ప్రభుత్వ ఉద్యోగి బలి అయ్యాడని మండిపడింది. కలబురగిలో జీతం రాలేదని ఓ లైబ్రేరియన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరో ఉద్యోగి  ప్రాణం పోవడం దురదృష్టకరమని తెలిపింది.