
తహసీల్దార్లు, డీటీలకు రేపటి నుంచి ధరణిపై ట్రైనింగ్
జిల్లాలవారీగా మూడు రోజులపాటు శిక్షణ
ఇప్పటికే తహసీల్ ఆఫీసుల్లో కంప్యూటర్లు, ఫర్నిచర్ ఏర్పాటు
25వ తేదీ దాకా కొన్ని రోజులు ట్రయల్ రన్!
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసే విధానంపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ధరణి కంప్యూటర్ ఆపరేటర్లకు 10వ తేదీ నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానుంది. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు జిల్లాల వారీగా ఎక్కడికక్కడే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ నెల 25న ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో… ట్రైనింగ్ ఇచ్చి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ముందస్తుగా కొద్దిరోజులు ట్రయల్ రన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అంతా రెడీ
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిర్వహించేందుకు తహసీల్దార్ ఆఫీసుల్లో సర్వం సిద్ధం చేశారు. ఒక్కో ఆఫీసుకు రూ.10 లక్షలను ప్రభుత్వం కేటాయించగా.. ప్రతి కార్యాలయంలో రెండు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, రెండు సీసీ కెమెరాలు, ప్రింటర్ టెలివిజన్, వెబ్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్, స్కానర్ తదితరాలను ఏర్పాటు చేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రతి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక డాక్యుమెంట్ రైటర్ ను కూడా నియమించనున్నట్లు తెలిసింది. తహసీల్దార్లు ఇకపై రోజూ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం జాయింట్ సబ్ రిజిస్ర్టార్‌గా.. మధ్యాహ్నం తహసీల్దార్‌గా డబుల్ రోల్ పోషించనున్నారు. దీంతో వారికి కొంత పని భారం పెరిగే అవకాశముంది.
ప్రమోషన్లకు లైన్ క్లియర్
కొత్త రెవెన్యూ చట్టం అమలు నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అన్ని స్థాయిల్లో ప్రమోషన్లు ఇచ్చేందుకు సీసీఎల్ఏ రంగం సిద్ధం చేసింది. అర్హులైన సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలకు డిప్యూటీ తహసీల్దార్లుగా, డీటీలకు తహసీల్దార్లుగా, తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. రెండు, మూడు రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ కొలిక్కి రానుందని తెలిసింది.
ఆఫీసులకు అదనపు కనెక్షన్లు
రాష్ట్రంలోని 590 తహసీల్దార్ కార్యాలయాలకు అదనంగా ఒక్కో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్షన్ ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ గురువారం ఆదేశించారు. ప్రస్తుతం 12 ఎంబీపీఎస్ కలిగిన బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్ల సమయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు మరో కనెక్షన్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉన్న స్థానిక నెట్ వర్క్స్ నుంచి తహసీల్దార్లు బ్రాడ్‌బాండ్ కనెక్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇలా తీసుకున్న వారికి సర్టిఫైడ్ బిల్స్ ఆధారంగా నెలకు రూ.2 వేలలోపు రీయింబర్స్ చేయనున్నారు.
For More News..