కొంత గ్యాప్ తర్వాత మరోసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు వడ్డే నవీన్. ఆయన హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడు. రాశిసింగ్ హీరోయిన్. శుక్రవారం సినిమా రిలీజ్ సందర్భంగా వడ్డే నవీన్ ఇలా ముచ్చటించారు.
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది. కేవలం లవ్ స్టోరీస్, ఫ్యామిలీస్ ఎంటర్‌టైనర్స్ తీస్తే సరిపోవడం లేదు. సరికొత్త కంటెంట్‌ను అన్ని కమర్షియల్ అంశాలు జోడించి అందిస్తేనే ఆదరిస్తున్నారు. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ సినిమా స్టోరీ కూడా అలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది.
కథ నెమ్మదిగానే ప్రారంభం అవుతుంది. కానీ సంఘర్షణ మొదలయ్యాక గ్రిప్పింగ్‌గా వెళ్తుంది. క్లైమాక్స్‌ని మాత్రం ఎవ్వరూ ఊహించలేరు. చాలావరకు రియలిస్టిక్‌గా ఉంటూనే అవసరం ఉన్న చోట మాత్రమే ఫైట్, పాటలను పెట్టాం. త్రిమూర్తులు పాత్రలోనే ఎంతో ఎంటర్‌టైన్మెంట్ ఉంది. సిస్టంలో ఉంటూనే పోరాడే కానిస్టేబుల్‌గా కనిపిస్తా. ప్రేక్షకులు ఊహించినట్టుగా రెగ్యులర్‌లా సినిమా ఉండదు.
నేను ఎక్కడ కనిపించినా ‘మళ్లీ సినిమాలు చేయండి సార్’ అని ప్రేక్షకులు ప్రేమగా అడిగేవారు. నాపై వాళ్లు చూపించిన అభిమానానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకున్న పరిచయాలతో నేరుగా పెద్ద దర్శకుడితో సినిమా చేయొచ్చు. కానీ ముందు నా మార్కెట్ ఎంత ఉందో తెలియాలి. ఈ సినిమా బయటకు వస్తే నా మార్కెట్ తెలుస్తుంది. సోలో హీరోగానే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నా. కథ నచ్చితే మల్టిస్టారర్, కంటెంట్ నచ్చితే ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తాను.
ఈ కథను నేను నమ్మాను. అందుకే నిర్మించేందుకు ముందుకు వచ్చాను. స్క్రిప్ట్ మీద ఏడాది పని చేశాం. కమల్ మేకింగ్, టేకింగ్ చాలా కొత్తగా అనిపించింది. నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. అయితే అన్నీ ముందే ప్లాన్ చేసుకోవడంతో ఎలాంటి సమస్య రాలేదు. ఇక ఇప్పటికే జీ సంస్థ ఓటీటీ హక్కుల్ని తీసుకుంది.
