- డీపీసీ సమావేశంలో ఖరారైన పదోన్నతులు
- చెక్‌పోస్టుల రద్దుతో రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్‌ల కోసం అధికారుల ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగులు, అధికారుల బదిలీలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేయడంతో అన్ని సెక్షన్లలో, అన్ని స్థాయిల్లో ఈ ప్రక్రియ జరగనుంది. బదిలీల పూర్తికి ఈ నెల 31వ తేదీని ప్రభుత్వం గడువుగా నిర్ణయించింది. దీంతో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో బదిలీల ప్రక్రియ ముగియనుంది. పదోన్నతులు పొందిన వారు, ఒకే చోట మూడేళ్లకు పైగా పనిచేస్తున్న వారు బదిలీల జాబితాలో ఉన్నారు.
అయితే ఏ విభాగంలోనూ మొత్తం సిబ్బందిలో 40 శాతానికి మించి బదిలీలు జరగకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.దీనికోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఇప్పటికే సమావేశమై పదోన్నతుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా లభించింది. దీని ఆధారంగా అధికారులు కసరత్తు పూర్తి చేసి తుది జాబితాను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్‌లకు పంపించారు. ఈ నెల 30 లేదా 31వ తేదీన బదిలీలకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రక్రియలో భాగంగా ఒక డీటీసీకి జేటీసీగా పదోన్నతి కల్పించనున్నారు. హైదరాబాద్ సిటీ జేటీసీగా పనిచేసిన రమేశ్‌కు అడిషనల్ కమిషనర్‌గా ప్రమోషన్ వచ్చింది. ఆయన స్థానంలో పదోన్నతి పొందే డీటీసీకి జేటీసీగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. అలాగే నలుగురు ఎంవీఐలకు ఆర్టీవోలుగా, మరికొందరు ఏఎంవీఐలకు ఎంవీఐలుగా ప్రమోషన్లు ఇస్తూ పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
హైదరాబాద్‌లో మకాం..
బదిలీల నేపథ్యంలో పలువురు అధికారులు విధులను పక్కనపెట్టి పోస్టింగ్‌ల కోసం హైదరాబాద్‌లో మకాం వేసినట్లు సమాచారం. నచ్చిన చోటుకు బదిలీ చేయించుకునేందుకు కొందరు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చెక్‌పోస్టుల పోస్టింగ్‌లకు భారీ డిమాండ్ ఉండేది. అయితే ప్రస్తుతం చెక్‌పోస్టులు రద్దు కావడంతో చాలా మంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కన్నేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాహనాలలో సుమారు 70 శాతం వాహనాలు హైదరాబాద్ సిటీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. దీనివల్ల ఇక్కడ అదనపు ఆదాయం లభిస్తుందనే ఆశతో ఎక్కువ మంది అధికారులు, ఉద్యోగులు ఇక్కడే పోస్టింగ్‌లు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
