రవాణా శాఖలో ప్రమోషన్లు ఎప్పుడు?..ఎంవీఐలు, ఏఎంవీఐల్లో తీవ్ర అసంతృప్తి

రవాణా శాఖలో ప్రమోషన్లు ఎప్పుడు?..ఎంవీఐలు, ఏఎంవీఐల్లో తీవ్ర అసంతృప్తి

 

  • డీసీపీ సమావేశం నిర్వహించకపోవడంపై ఆవేదన

 హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖలో ప్రమోషన్లులేక ఎంవీఐలు, ఏఎంవీఐలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆర్టీఏలకు, డీటీసీలకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం తమ విషయంలో  పక్షపాత ధోరణితో వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎంవీఐలు గత మూడేండ్ల నుంచి ప్రమోషన్ల కోసం పడిగాపులు గాస్తున్నారు. రవాణా శాఖలోని పైఅధికారులకు పదోన్నతులు కల్పించిన ఉన్నతాధికారులు.. తమ విషయానికి వచ్చే సరికి ముఖం చాటేస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పైగా ఎంవీఐలకు ప్రమోషన్లు కల్పించకపోవడంతో ప్రస్తుతం పది ఆర్టీఏ పోస్టులు, కొత్త జిల్లాల్లో జిల్లాకో ఆర్టీఏ పోస్టులు మొత్తం 20 వరకు పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో పాలనా పరంగా రవాణా శాఖలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  అది నేరుగా ప్రజలపై చూపుతున్నా సర్కార్ మాత్రం స్పందించడం లేదు. పదోన్నతుల కోసం ప్రతి ఏడాది ఆగస్టులో డీపీసీ ( డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ) సమావేశం కావడం ఆనవాయితీ.

అయితే, ఈ నెల సగం గడిచినా ఇప్పటి వరకు దాని ఊసే లేదు. దీంతో ఈసారి కూడా తమకు  ప్రమోషన్లు అందని ద్రాక్షేనా అనే నిరాశలో పలువురు ఎంవీఐలు, ఏఎంవీఐలు ఉన్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ ఎంవీఐలు ఆర్టీఏ కన్నా ఎక్కువ స్కేల్​లో ఉన్నారు. ఇలాంటి వారికి ప్రమోషన్లు కల్పించినా రవాణా శాఖపై ఎలాంటి ఆర్థిక భారం కూడా పడదు.

అయినా ఎంవీఐలకు పదోన్నతులు కల్పించకుండా అడ్డుకోవడంతో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తమకు అర్థం కావడం లేదని పలువురు ఎంవీఐలు అంటున్నారు. ఆర్టీఏలకు డీటీసీలుగా, డీటీసీలకు జేటీసీలుగా ప్రమోషన్​ కల్పించిన ప్రభుత్వం.. ఎంవీఐలకు ఆర్టీఏలుగా, ఏఎంవీఐలకు ఎంవీఐలుగా పదోన్నతులు కల్పించి రవాణా శాఖలో పాలనాపరమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులు కోరుతున్నారు.