అన్నా.. వస్తున్నా..! రాష్ట్రంలో రాఖీ పండుగ సందడి

అన్నా.. వస్తున్నా..! రాష్ట్రంలో రాఖీ పండుగ సందడి
  • పుట్టింటికి పయనమైన అక్కాచెల్లెళ్లు
  • కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
  • రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాటు
  • రేట్లు పెంచేసిన ప్రైవేటు వెహికల్స్​

హనుమకొండ, వెలుగు:  అన్నదమ్ముళ్ల  కోసం అక్కా చెల్లెల్లు పుట్టింటికి ప్రయాణమయ్యారు. చదువులు, ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలకు కాస్త గ్యాప్​ ఇచ్చి వివిధ ప్రాంతాల నుంచి సొంతూరు బాట పట్టారు.  రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ కళ సంతరించుకుంది. ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.  పుట్టింటికి వెళ్లడం వీలుకాని అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ కార్గోలు, ఇతర కొరియర్ల ద్వారా అన్నదమ్ములకు రాఖీలు పంపించి, తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు.  ఇదిలా ఉంటే ఆర్టీసీ అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేసింది.  ఈ నాలుగైదు రోజుల్లో సంస్థకు నిరుటి మాదిరిగానే రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.

తోబుట్టువులకు స్పెషల్​..

మన పండుగలన్నింటిలో తోబుట్టువులు ప్రేమానుబంధాలతో జరుపుకొనేది రాఖీ పండుగే.  రాఖీ కట్టిన సోదరికి కలకాలం రక్షగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. శ్రావణ మాస పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగను దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వైశ్య, పద్మశాలీ  తదితర కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు జంధ్యాలు ధరిస్తుంటారు. పాతవి ఉంటే వాటి స్థానంలో కొత్తవాటిని ధరిస్తుంటారు. 

అన్నదమ్ముల కోసం పుట్టింటి బాట

రాఖీ పండుగ ఏ రోజున జరుపుకోవాలనే విషయంలో కన్ఫ్యూజన్​ ఏర్పడగా.. ఆగస్టు  31 తేదీన   జరుపుకోవాలని క్లారిటీ ఇచ్చారు. దీంతో   ఉద్యోగాలు, చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉండే యువతులతో పాటు మెట్టినింటి నుంచి ఎంతోమంది మహిళలు పుట్టింటి బాట పట్టారు. ఫలితంగా రాష్ట్రంలో ప్రధాన బస్టాండ్లు మహిళలతో కిటకిటలాడాయి. రాఖీ పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా..  హైదరాబాద్​ తో పాటు కరీంనగర్​, మెదక్​, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఇలా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. 

ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ప్రధాన హనుమకొండ బస్ స్టేషన్​ నుంచి సాధారణ రోజుల్లో 860 బస్సులు నడిపిస్తుండగా.. పండుగ కావడంతో అదనంగా మరో 130 బస్సులు అందుబాటులో ఉంచినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్​ శ్రీలత తెలిపారు. ఈ నెల 30 నుంచి పండుగ అనంతరం తిరుగు ప్రయాణాలతో కలిపి సెప్టెంబర్​ 1, 2 తేదీల వరకు నాలుగు రోజుల్లో దాదాపు రూ.5 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుడు రాఖీ పండుగకు రూ.20 కోట్లకుపైగా ఆదాయం సమకూరగా.. ఈసారి అంతకుమించి ఆదాయం రాబట్టేందుకు బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

పార్శిళ్లు, కొరియర్లలో కొందరు

అన్నదమ్ముల వద్దకు నేరుగా వెళ్లడానికి వీలు లేని కొంతమంది మహిళలు ఆర్టీసీ కార్గో సేవలతో పాటు వివిధ కొరియర్​ సర్వీసులను వాడుకుంటున్నారు. పార్శిల్​ చేసిన కవర్లలో రాఖీలు, స్వీట్లు పెట్టి తమ అన్నదమ్ములకు పంపించారు. హనుమకొండ బస్టాండ్​ లోని ఆర్టీసీ కార్గో సెంటర్​కు మధ్యాహ్నం వరకు దాదాపు వందకు పైగా రాఖీ పార్శిల్స్​ వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.

రైళ్లు, ప్రైవేట్​ వెహికల్స్​ ఫుల్​

రైళ్లు, ప్రైవేటు వెహికిల్స్​ కూడా కిటకిటలాడుతున్నాయి. కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లలో బుధవారం ప్రయాణ రద్దీ ఎక్కువగా కనిపించింది. కాగా  బస్సుల్లో రష్​ ఎక్కువగా ఉండడంతో కొంతమంది ప్రైవేటు వెహికల్స్​ను ఆశ్రయించారు. దీంతో  ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది వాహనదారులు రేట్లు పెంచారు. హైదరాబాద్​ నుంచి హనుమకొండకు సాధారణ రోజుల్లో రూ.300 నుంచి రూ.350 వరకు వసూలు చేయగా.. పండుగ రష్​ ఎక్కువ ఉండడంతో రూ.400 నుంచి రూ.500 వరకు రేట్లు పెంచినట్లు ప్రయాణికులు తెలిపారు.

ఆర్టీసీలో రాఖీ రష్..

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కి రాఖీ పండుగ జోష్ వచ్చింది. రాఖీ పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రధాన బస్టాండ్లలో బుధవారం ఉదయం నుంచే రద్దీ నెలకొంది. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ , జేబీఎస్, ఉప్పల్, ఎల్ బీ నగర్, ఆరాంఘర్ ఇలా అన్ని ప్రాంతాల్లో ప్యాసింజర్లు కిటకిటలాడారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, అన్ని సర్వీసులు రద్దీగా తిరుగుతున్నాయి.  3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించినా సరిపోవడం లేదని ప్యాసెంజర్లు విమర్శిస్తున్నారు.  సిటీ లో ని పలు ప్రాంతాల్లో బస్సుల ఆపరేషన్ కు 11 మంది ఆఫీసర్లను ఆర్టీసీ ప్రత్యేకంగా నియమించింది.