- కొత్తగూడెంలో త్రిముఖ, ఇల్లెందు, అశ్వారావుపేటల్లో ద్విముఖ పోటీ
- కార్పొరేషన్లో మకాం వేసిన ఎంపీ రామసహాయం
- ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించిన టీపీసీసీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొత్తగూడెం కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రత్యేకంగా పీసీసీ ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించింది. రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఇప్పటికే ఒక దఫా ప్రచారం నిర్వహించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి కార్పొరేషన్లో మకాం వేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో త్రిముఖ పోటీ నెలకొంది. ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ద్విముఖ పోరు నెలకొంది.
కొత్తగూడెంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలోనే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్పై పలు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్ధతుతో కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో సీట్ల కేటాయింపులో కాంగ్రెస్, సీపీఐల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఇరు పార్టీలు ఈ కార్పొరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లకు కాంగ్రెస్ మొత్తం డివిజన్లలో పోటీ చేస్తోంది. టీడీపీతో కలిసి సీపీఐ 59 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఇప్పటికే కార్పొరేషన్లో మకాం వేశారు. అభ్యర్థుల ఎంపికలో కీలక భూమిక పోషించారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం కార్పొరేషన్ పరిధిలోని పలుచోట్ల కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ లో నేతల మధ్య కొంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చడంతో పాటు అందరిని కో ఆర్డినేషన్ చేసుకునేందుకు పీసీసీ ముగ్గురు కో ఆర్డినేటర్లను నియమించింది. తుళ్లూరి బ్రహ్మయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్. జగదీశ్వర్ రావులను ప్రత్యేకంగా కో ఆర్డినేటర్లుగా పీసీసీ నియమించింది.
కొత్తగూడెంలో త్రిముఖ పోటీ : కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ల మధ్య పోటీ ఉంది. నిన్నటి దాకా కలిసి పనిచేసిన కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కార్పొరేషన్ ఎన్నికల్లో నువ్వా నేనా అనే విధంగా ఫైట్ చేస్తున్నాయి. కొత్తగూడెం కార్పోరేషన్‌గా ఏర్పడక ముందుకు బీఆర్ఎస్ పాలకవర్గం ఉంది. కాంగ్రెస్ సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. సీపీఐ టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. కార్పోరేషన్లో తొలి మేయర్‌గా తమ పార్టీకి చెందిన అభ్యర్థే ఉండాలనే టార్గెట్ పెట్టుకొని కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, బీఆర్ఎస్లు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో : ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ద్విముఖ పోటీ నెలకొంది. ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూటమి పార్టీల మధ్య పోరు నెలకొంది. కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగింది. సీపీఐ, సీపీఎం, మాస్‌లైన్ పార్టీలతో కలిసి బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తొంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇల్లెందు, అశ్వారావు పేట మున్సిపాలిటీల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది.
