త్రిపుర: త్రిపురలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట గస్తీ నిర్వహిస్తున్న భద్రతా దళం (బీఎస్ఎఫ్) జరిపిన కాల్పుల్లో ఇద్దరు అనుమానిత బంగ్లాదేశీ స్మగ్లర్లు మృతి చెందారు. సెపహిజాల జిల్లాలోని భారత్–-బంగ్లాదేశ్ సరిహద్దు ‘జీరో పాయింట్’ సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. శనివారం వారి మృతదేహాలను బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించారు.
‘‘రాత్రి సమయంలో భారత్ నుంచి బంగ్లాదేశ్‌లోకి కొందరు స్మగ్లర్లు అక్రమంగా వస్తువులను తరలించేందుకు ప్రయత్నిస్తుండగా జవాన్లు పదేపదే హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. బీఎస్ఎఫ్ సిబ్బందిపై రాళ్లు, ఇటుకలతో దాడికి దిగారు” అని అధికారిక వర్గాలు తెలిపాయి.
పరిస్థితి అదుపుతప్పడంతో జవాన్లు ఆత్మరక్షణ కోసం ‘పంప్ యాక్షన్ గన్స్’ (పీఏజీ)తో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
