ఇందిరమ్మ స్కీమ్కు కేంద్ర నిధులు పెండింగ్.. లక్ష ఇండ్లు పూర్తయినా రాని పీఎం ఆవాస్ యోజన నిధులు

ఇందిరమ్మ స్కీమ్కు కేంద్ర నిధులు పెండింగ్.. లక్ష ఇండ్లు పూర్తయినా రాని పీఎం ఆవాస్ యోజన నిధులు
  • లబ్దిదారులకు చివరి విడత సాయానికి బ్రేక్
  • రూరల్ ఇండ్లకు రూ. 720 కోట్లు బాకాయిలు 
  • కేంద్రం ఇస్తే నేరుగా లబ్ధిదారులు ఖాతాల్లోకి ఫండ్స్
  • తరువాత రూ. 28 వేలు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • రూరల్‌‌లో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని మోదీ సర్కార్
  • డబ్బుల కోసం హౌసింగ్ అధికారులను ప్రశ్నిస్తున్న లబ్ధిదారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఉద్దేశించిన ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వటం లేదు. స్కీమ్ స్టార్ట్ చేసి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు రూరల్ లో కేంద్రం ఒక్క ఇల్లు కూడా సాంక్షన్ చేయలేదు. మరోవైపు రూరల్ లో గత ఏడాదిన్నరలో రాష్ర్ట ప్రభుత్వమే మొదటి దశలో లక్షన్నర ఇండ్లను పూర్తి చేసింది. ఇందులో 50 వేల మంది గృహ ప్రవేశాలు కూడా చేశారు.

వచ్చే సెప్టెంబర్ చివరి నాటికి మరో లక్ష ఇండ్లను పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రెండో దశ స్కీమ్ ఈ నెల 1 నుంచి స్టార్ట్ చేయగా.. ఇండ్లను లబ్దిదారులకు మంజూరు చేసే పక్రియ సైతం వేగంగా సాగుతోంది.  గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు లక్ష ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో లబ్ధిదారులకు చివరి విడత చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో బిల్లు ఎపుడు రిలీజ్ చేస్తారని హౌసింగ్ అధికారులను లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. 

  • ​లక్ష ఇండ్లకు రూ.720 కోట్లు పెండింగ్

​రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పరిధిలో ప్రస్తుతం లక్ష ఇండ్లు పూర్తయ్యాయి. లబ్దిదారులు ఆ ఇండ్లలో నివసిస్తన్న చివరి విడత రూ.1 లక్ష ఇంకా వారి ఖాతాలకు జమ కాలేదు. ఒక్కో ఇంటికి రాష్ర్ట ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుండగా ఇందులో కేంద్రం పీఎం అవాస్ యోజన స్కీమ్ వాటా కింద ఒక్కో ఇంటికి రూ. 72 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా లక్ష ఇండ్లకు కేంద్రం నుంచి రూ. 720 కోట్లు రావాల్సి ఉందని హౌసింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక మిగతా సాయాన్ని రాష్ర్ట ప్రభుత్వమే ఇస్తోంది. చివరి విడత నిధుల కోసం లబ్ధిదారులు చాన్నాళ్లుగా 
ఎదురుచూస్తున్నారు.

  • నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే కేంద్ర సాయం

కేంద్ర ప్రభుత్వం పీఎం అవాస్ యోజన స్కీమ్ కింద ఒక్క ఇంటికి రూ. 72 వేలను నేరుగా డీబీటీ ( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ) పద్దతిలో  నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ చేయాల్సి ఉంది. అయితే, ఈ నిధుల విడుదలలో ఆలస్యం కావడం వల్ల క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిధుల విడుదల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంది.

నిబంధనల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ వాటా లబ్ధిదారుల ఖాతాల్లో పడగానే, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సాయాన్ని జమ చేస్తుంది. అయితే లక్షల మంది సొంత ఇంటి కలను నిజం చేసే దిశగా ఇండ్ల నిర్మాణం ఆగోద్దని ఉద్దేశంతో ఇప్పటి వరకు రాష్ర్ట ప్రభుత్వం లబ్దిదారుల  ఖాతాల్లో రూ. 6 వేల కోట్లను బదిలీ చేసింది.  కేంద్రం నుంచి  రూ. 72,000 జమ అయిన తర్వాతే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మిగిలిన రూ. 28,000 మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.

  • ఒక్క ఇల్లు సాంక్షన్ చేయని కేంద్రం

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ మొదలై ఏడాదిన్నర అవుతున్నా రూరల్ లో కేంద్రం ఒక్క ఇంటిని మంజూరు చేయలేదు. దీనిపై కేంద్ర హౌసింగ్ అర్బన్ శాఖ మంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి,  హౌసింగ్ మంత్రి పొంగులేటి పలు సార్లు ఢిల్లీలో, హైదరాబాద్ వచ్చినపుడు కలిసి కోరారు.  

హౌసింగ్ అధికారులు సైతం ఢిల్లీ వెళ్లిన సమయంలో కేంద్ర హౌసింగ్ అర్బన్ అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. మరో వైపు అర్బన్ లో  కేంద్రం 40 వేల ఇండ్లను మంజూరు చేయగా మొదటి ఇన్ స్టాల్ మెంట్ కింద రూ. 107 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. అర్బన్ లో కేంద్రం ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల సాయం అందచేస్తోంది.