- స్టూడెంట్ల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలు
- ..15 నుంచి 20 శాతం క్రెడిట్ల కేటాయింపు
- స్టార్టప్ ఐడియాలు, హ్యాకథాన్స్,
- కమ్యూనిటీ సర్వీస్‌కు కూడా క్రెడిట్స్
- రెగ్యులర్ పాఠాలకు ఆటంకం కలగకుండా
- నిర్వహణ.. ఫీల్డ్‌వర్క్ చేస్తేనే చేతికి పట్టా
- మార్కెట్ అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్లను
- రెడీచేసే పనిలో విద్యాశాఖ
- ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి..
హైదరాబాద్, వెలుగు:పుస్తకాల్లోని పాఠాలకు, సమాజంలోని పరిస్థితులకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేందుకు సర్కారు రెడీ అయింది. కేవలం 4 గోడలకే పరిమితమైన మూస చదువులకు స్వస్తి పలుకుతూ.. సమాజమే క్లాస్ రూమ్‌గా, ప్రపంచమే ల్యాబ్‌గా మార్చేలా కొత్త విధానం తీసుకొస్తున్నది. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఇకపై కేవలం క్లాస్ రూమ్ చదువులే కాదు.. ఫీల్డ్‌వర్క్ కూడా తప్పనిసరి కానుంది.
ఆయా కోర్సుల్లో ఎక్స్ పీరియెన్షియల్ లెర్నింగ్ (అనుభవాత్మక విద్య) పేరుతో కొత్త విధానాన్ని ఉన్నత విద్యామండలి తీసుకొస్తున్నది. థియరీ నాలెడ్జ్‌ను ప్రాక్టికల్ స్కిల్స్‌తో జోడించి, కాలేజీ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా విద్యార్థులను ‘ఇండస్ట్రీ రెడీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయబోతున్నది.
రాష్ట్రంలోని డిగ్రీ, పీజీసహా పలు కోర్సుల్లో ప్రస్తుత చదువులు సమాజ, మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకే ఎక్స్ పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్‌ను విద్యాశాఖ డిజైన్ చేసింది. విద్యార్థులు చదువుతున్న సబ్జెక్టులను సమాజంలోని సమస్యలతో అనుసంధానం చేయడం దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ)లోనూ ఇంటర్న్‌షిప్‌లు, ఫీల్డ్ వర్క్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించడంతో.. దానికి తగ్గట్టుగా టీజీసీహెచ్ఈ (ఉన్నత విద్యామండలి) చర్యలు చేపట్టింది.
ఇందులో అనుభవాత్మక విద్యలో భాగంగా ఇంటర్న్‌షిప్, ప్రాజెక్ట్ వర్క్, కమ్యూనిటీ సర్వీస్ తోపాటు ఫీల్డ్ వర్క్ తదితర అంశాలను చేర్చారు. స్టూడెంట్ల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలను టీజీసీహెచ్ఈ సూచిస్తోంది. గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలు చూడడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల పనితీరు గమనించడం, మున్సిపల్ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించడంలాంటివి ఇందులో ఉన్నాయి. వీటితోపాటు స్టార్టప్ ఐడియాలు, హ్యాకథాన్స్, కమ్యూనిటీ సర్వీస్ ద్వారా కూడా క్రెడిట్లు సాధించవచ్చు. ఇది విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్‌తోపాటు సామాజిక బాధ్యతను పెంచుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, అఫిలియేటెడ్ కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానం అమలు కానున్నది.
నిర్వహణకు స్పెషల్ వింగ్..
ప్రతి విద్యాసంస్థలో ఈ విధానం సజావుగా సాగేందుకు ఒక ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఒక సీనియర్ ఫ్యాకల్టీ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. డిపార్ట్‌మెంట్ స్థాయిలో కోఆర్డినేటర్లు ఉంటారు. ప్రతి విద్యార్థికి ఒక ఫ్యాకల్టీ మెంటార్‌తోపాటు క్షేత్రస్థాయిలో వారు పని చేసే సంస్థ నుంచి ఒక సూపర్ వైజర్ ఉంటారు. వీరు విద్యార్థి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ గైడ్ చేస్తారు.
ఈ విధానంలో సంప్రదాయంగా ఉండే రాత పరీక్షలు ఉండవు. విద్యార్థి క్షేత్రస్థాయిలో నేర్చుకున్న అంశాలను రిఫ్లెక్టివ్ జర్నల్ (అనుభవాల డైరీ) రూపంలో రాయాల్సి ఉంటుంది. చేసిన పనికి సంబంధించిన ఫొటోలు, రిపోర్టులు, వీడియోలతో ఒక డిజిటల్ పోర్ట్‌ఫోలియో సిద్ధం చేయాలి. దీనిపై వైవా, ప్రజెంటేషన్ ఆధారంగా ఫ్యాకల్టీ కమిటీ మార్కులు, క్రెడిట్లు కేటాయిస్తారు. త్వరలోనే యూనివర్సిటీలవారీగా ఫ్యాకల్టీకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, అకడమిక్ క్యాలెండర్‌లో దీనికి తగిన స్థానం కల్పించనున్నారు.
నిర్ణీత క్రెడిట్లను సాధించాల్సిందే..
కొత్త విధానం ప్రకారం కోర్సు పూర్తయ్యేలోపు విద్యార్థులు నిర్ణీత క్రెడిట్లను సాధించాలి. ఎన్‌ఈపీ గైడ్‌లైన్స్ ఆధారంగా యూజీ , పీజీ విద్యార్థులకు 15 నుంచి 20 శాతం క్రెడిట్స్ పెడుతున్నారు. వీటన్నింటినీ ఫీల్డ్ వర్క్, ప్రాజెక్టుల ద్వారానే సంపాదించాల్సి ఉంటుంది. అవి చేయకపోతే విద్యార్థులకు పట్టా అందదు. వీటిని అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఏబీసీ) లో కూడా నమోదు చేస్తారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రతీ సెమిస్టర్ చివర్లో దీన్ని అమలు చేయబోతున్నారు.
ఈ కొత్త విధానంతో రెగ్యులర్ పాఠాలకు ఎలాంటి ఆటంకం కలగదు. ఇది ఒక కొనసాగింపు ప్రక్రియలా సాగుతుంది. సెమిస్టర్ల మధ్యలో వచ్చే సెలవులు, నిర్ణీత సమయాల్లో విద్యార్థులు ఫీల్డ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులు పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు. కాలేజీలే స్థానిక పరిశ్రమలు, ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రులు, ఎన్జీవోలతో ఒప్పందాలు కుదుర్చుకొని స్టూడెంట్లకు అవకాశం కల్పిస్తాయి.
సొసైటీకి కనెక్ట్ చేసేందుకే
విద్యార్థులను సొసైటీకి కనెక్ట్ చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నాం. డిగ్రీ పూర్తైన వెంటనే ఉద్యోగం సాధించడంలో విద్యార్థులు ఎదుర్కొం టున్న ఇబ్బందులను ఈ విధానం తొలగిస్తుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. టెక్నికల్, మేనేజ్‌మెంట్ విద్యార్థులే కాకుండా ఆర్ట్స్, సైన్స్ స్టూడెంట్లకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్ పాఠాలకు డిస్టర్బ్ కాకుండా దీన్ని అమలు చేస్తాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవిధానానికి ప్రాధాన్యత ఉంది.
- ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, టీజీసీహెచ్ఈ చైర్మన్ -
