జూబ్లీహిల్స్, వెలుగు: మంత్రి ఆఫీస్‌లో పని చేస్తున్నాను.. ప్రభుత్వ బిల్లులు క్లియర్ చేయిస్తానంటూ ఓ సివిల్ కాంట్రాక్టర్‌ను నమ్మించి, రూ.3 లక్షలు కాజేసిన మహిళపై బంజారాహిల్స్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్నమోదు చేశారు. బండ్లగూడ జాగీర్‌లోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన సివిల్ కాంట్రాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ తన పెండింగ్ బిల్లులు విడుదల చేయించేందుకు 2024లో వి.పుష్పలతను సంప్రదించాడు. ఆమె తాను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆఫీస్‌లో పని చేస్తున్నానని చెప్పి, పని పూర్తి చేయడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని అడిగింది. ఆమె మాటలు నమ్మిన శ్రీనివాస్ గౌడ్ రూ.3 లక్షలు ఇచ్చాడు.
తర్వాత పుష్పలత బిల్లులు రిలీజ్చేయించలేదు. పలుమార్లు కాల్స్చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి, తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా మంత్రిని సంప్రదించి ఆరా తీయగా.. ఈ వ్యవహారానికి మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్ గౌడ్ పుష్పలతపై శుక్రవారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్ఐఆర్నమోదు చేసి, కేసును ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్‌కు ట్రాన్స్ఫర్చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
