- క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే టార్గెట్‌గా కీలక భేటీలు
- వర్చువల్ విధానంలో ఒకే రోజు 10 జిల్లాల బీజేపీ ఆఫీసుల ప్రారంభం
- బూత్ కమిటీలతోనూ నేరుగా ముఖాముఖి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ తన వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగానే పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి, నాయకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటనను రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
షెడ్యూల్ ప్రకారం..నితిన్ నబిన్ ఆదివారం ఉదయమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన 10 జిల్లాల పార్టీ ఆఫీసులను ఆన్‌లైన్ (వర్చువల్) పద్ధతిలో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొని, క్షేత్రస్థాయి నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. అదే రోజు రాత్రి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తారు.
స్టూడెంట్స్, ఆదివాసీలతో భేటీ
పర్యటనలో భాగంగా రెండో రోజు జూన్ 29న ఉదయం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావుకు చెందిన వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించే విద్యార్థుల సదస్సులో (స్టూడెంట్ కాన్ క్లేవ్) నితిన్ నబిన్ పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన భువనగిరి మీదుగా వరంగల్ చేరుకుంటారు. అక్కడ లంబాడ, కోయ, చెంచు, గోండు వంటి వివిధ ఆదివాసీ, గిరిజన తెగల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బూత్ ప్రెసిడెంట్లతో నిర్వహించే కీలక భేటీలో పాల్గొంటారు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలి అనే అంశాలపై అక్కడి స్థానిక నాయకులతో కూలంకషంగా చర్చిస్తారు.
కార్యవర్గ సమావేశంతో ముగింపు
చివరి రోజైన జూన్ 30న ఘట్‌కేసర్‌లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశం, అలాగే ఆఫీస్ బేరర్స్ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొంటారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై నాయకులకు పూర్తిస్థాయిలో మార్గదర్శనం చేయనున్నారు. ఈ పర్యటన పూర్తిగా పార్టీ అంతర్గత నిర్మాణం, బలోపేతం కోసమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు జాతీయ అధ్యక్షుడు తెలంగాణలోనే ఉండి సమయం కేటాయించడం అనేది, మన రాష్ట్రంపై కేంద్ర అధిష్టానానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మూడు రోజుల కార్యక్రమాలు ముగిసిన తర్వాత నితిన్ నబీన్ మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు.
