త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టత అస్పష్టంగా కనిపిస్తోంది. 60 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు బీజేపీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. వామపక్షాలు 18 స్థానాల్లోనూ, తిప్ర మోత పార్టీ 9 స్థానాల్లోనూ, ఇతరులు ఒక స్థానంలోనూ ముందంజలో ఉన్నారు. తుది ఫలితాలు వెలువడవలసిన నేపథ్యంలో తిప్ర మోతా పార్టీ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ పార్టీ కింగ్ మేకర్ కాబోతుందనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ప్రద్యోత్ కిశోర్ మాణిక్య దెబ్బర్మ ఏర్పాటు చేసిన ఈ పార్టీ ఇప్పుడు 9 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. బీజేపీ, -ఐపీఎఫ్‌టీ కూటమి 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. షెడ్యూల్డు తెగలకు కేటాయించిన 20 స్థానాల్లో ఈ పార్టీ అభ్యర్థులు ప్రారంభంలో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండేవారు. దీంతో అధికార బీజేపీ, వామపక్ష-కాంగ్రెస్ కూటమిని ఈ పార్టీ దెబ్బతీయగలిగింది. ఈ నేపథ్యంలో త్రిపురలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. వామపక్ష పార్టీల నేతలు ఇప్పటికే తిప్ర మోత పార్టీ నాయకత్వంతో మాట్లాడుతున్నట్లుగా సమాచారం. కాగా సీఎం మాణిక్ సాహా విజయం సాధించారు. బోర్దోవలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ... సీపీఎం అభ్యర్థి ఆశిష్‌కుమార్ సాహాపై 832 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
