
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొందు దొందేనని.. అవి కలిసే పని చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం రాజగోపాల్ రెడ్డిపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ చేసిన కామెంట్స్ ను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు మారలేదా...
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ రాజకీయంగా ఎదిగారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు మారలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వాడుకుని ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని, తమతో చాలామంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. బట్ట కాల్చి మీద వేయడం తగదన్నారు. బ్లాక్ మెయిలింగ్ నుంచి ఈ స్థాయికి వచ్చినట్లుగా రేవంత్ కామెంట్స్ ఉన్నాయని మండిపడ్డారు. ఏదైనా మాట్లాడితే సంస్కారం, సభ్యత ఉండాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో సరైన రిజల్ట్ రావడం లేదనే నిస్పృహలో రేవంత్ ఉన్నట్లు కనిపిస్తోందని, పిచ్చి భాష మాట్లాడితే ప్రజల్లో పలుచన అయ్యేది అతనేనని, అంత మొనగాడు అయితే కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేదు..? అని రేవంత్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్.. ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
రాజగోపాల్ రెడ్డిని ఇబ్బందులు పెట్టిన్రు...
తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలోకి రావాలని ఆనాడే రాజగోపాల్ రెడ్డిని అడిగారని, కానీ దానికి ఆయన ఒప్పుకోలేదని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసమే తాము పని చేస్తామని గతంలోనే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. కాంట్రాక్టు రద్దు చేసినా.. ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా కట్టుబడి పని చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతోందన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ.. ఇలా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులను అవమానించిన పార్టీ ఏదైనా ఉందంటే..అది కాంగ్రెస్సేనని అన్నారు. మహారాష్ట్రలో సిద్ధాంతాన్ని పక్కన పెట్టి.. శివసేన, ఎన్సీపీ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పొత్తుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని, అందుకే ఏక్ నాథ్ షిండే తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వర్తించారని ఈటల రాజేందర్ అన్నారు.
యూపీలో రెండు స్థానాలకే పరిమితం...
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైందని, అక్కడ రాహుల్ ను ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. రాహుల్ గాంధీ కేరళకు వెళ్లి ఎంపీ అయ్యారనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిధులున్నాయా ? ఉత్సవ విగ్రహాలుగా మారారని తాను వ్యాఖ్యానించడం తప్పా అని నిలదీశారు. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం తామేనంటూ..కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుని..పోటీ చేసిన రాష్ట్రాల్లో టీఆర్ఎస్ సహకరించడం లేదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పని చేసినట్లుగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పని చేస్తాయని చెప్పారు. మునుగోడులో జరగబోయే ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరగదని, కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతుందన్నారు.