లిక్కర్,పెట్రోల్, భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు.రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ సూచన

లిక్కర్,పెట్రోల్, భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు.రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ సూచన
  • పన్నుల ఆదాయం పెంచుకోండి.. పథకాలను అర్హులకే ఇవ్వండి
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ సూచన
  •     భూస్వాములకు, రాజకీయ నాయకులకు 
  • రైతు భరోసా సాయం ఎందుకు? 
  •     లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు, పరిశ్రమల్లోకి ప్రోత్సహించండి
  •     తిని కూర్చుంటే కొండైనా కరుగుతుంది.. 
  • ఆస్తులు పెంచితేనే భవిష్యత్తు 
  •     క్లైమేట్ బడ్జెటింగ్ విధానం అవసరం అని సూచన
  •     ‘స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26’  పేరుతో రిపోర్ట్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం కేవలం లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్, డీజిల్​పై వ్యాట్, భూముల రిజిస్ట్రేషన్ల మీదే ఆధారపడడం 
ఎంతమాత్రం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌బీఐ) తేల్చి చెప్పింది. కేవలం ఈ మూడు మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకురావడం భవిష్యత్తులో పెను ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు ‘స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-–26’ పేరుతో ఆర్‌‌‌‌బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో  ప్రభుత్వానికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాల అమలు విషయంలో ఆచితూచి అడుగులేయాలని, అనర్హులకు కాకుండా కేవలం అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగ, పారిశ్రామిక రంగాల్లోకి పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించింది. తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలాంటి సంక్షేమ పథకాలు బడ్జెట్‌‌‌‌పై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని ఆర్‌‌‌‌బీఐ  ప్రస్తావించింది. సామాజిక భద్రత అవసరమే అయినప్పటికీ, ఈ పథకాలు కేవలం ఓట్లు రాల్చే సాధనాలుగా మారకూడదని తెలిపింది. పథకాలను అందరికీ వర్తింపజేయడంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని,  భూస్వాములకు, రాజకీయ నాయకులకు కూడా రైతుభరోసా ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతున్నదని ఉదాహరణ కింద చూపింది. పథకాలను సమీక్షించుకొని, కేవలం పేదలకు, అర్హులైన వారికి మాత్రమే  నిధులు అందేలా చూడాలని,  మిగిలిన నిధులను విద్య, వైద్యంలాంటి కార్యక్రమాలకు వాడాలని  హితవు పలికింది.

పన్ను ఆదాయం కోసం తెలంగాణ ప్రధానంగా మూడు మార్గాలపై అతిగా ఆధారపడుతున్నదని ఆర్‌‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది.  రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో సింహభాగం కేవలం లిక్కర్​ అమ్మకాలు, భూముల రిజిస్ట్రేషన్లు, పెట్రోల్ ఉత్పత్తుల నుంచే వస్తున్నదని పేర్కొన్నది. ‘రియల్ ఎస్టేట్ రంగం ఏమాత్రం డీలా పడినా, అంతర్జాతీయ కారణాల వల్ల ఇంధన వినియోగం తగ్గినా రాష్ట్ర ఖజానా ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. సులభంగా డబ్బులు వచ్చే ఈ మూడు మార్గాలపైనే ప్రభుత్వం అతిగా ఆధారపడుతున్నది. ఇది తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుందేమో కానీ దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. అందువల్ల మైనింగ్‌‌లాంటి ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి” అని సూచించింది. ‘‘2025–26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 1,45,419 కోట్ల సొంత పన్నుల ఆదాయాన్ని అంచనా వేసింది. ఇందులో మెజారిటీ వాటా కేవలం 3 శాఖల నుంచే వస్తున్నది.  మద్యం ద్వారా రూ. 27,623 కోట్లు, సేల్స్​ టాక్స్​, వ్యాట్ (పెట్రోల్, డీజిల్, లిక్కర్ ) ద్వారా రూ. 37,463 కోట్లు, భూములు రిజిస్ట్రేషన్లతో రూ. 19,087 కోట్లుగా ఉంది. ఈ మూడింటినీ కలిపితే దాదాపు రూ. 84,173 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వం సంపాదించే ప్రతి 100 రూపాయల్లో దాదాపు 58 నుంచి 60 రూపాయలు కేవలం జనం తాగే మద్యం, వాడే పెట్రోల్, కొనే భూముల రిజిస్ట్రేషన్ల నుంచే వస్తున్నాయి.  రియల్ ఎస్టేట్ మరింత పడిపోయినా, జనం మద్యం తగ్గించినా రాష్ట్రం కుప్పకూలే ప్రమాదం ఉంది’’ అని  హెచ్చరించింది. 2025–26 బడ్జెట్‌‌లో మొత్తం వ్యయం సుమారు రూ. 2.90 లక్షల కోట్లు అయితే అందులో జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలకే  రూ. 2.21 లక్షల కోట్లు పోతున్నాయని  రోడ్లు, భవనాలులాంటి ఆస్తుల కల్పనకు  కేవలం రూ. 33,447 కోట్లు మాత్రమే కేటాయించారని ఆర్బీఐ విశ్లేషించింది. 

మహిళలకు ట్రైనింగ్​ ఇస్తే లేబర్​ కొరతకు చెక్


తెలంగాణలో  రాబోయే రోజుల్లో పనిచేసే వయసున్న జనాభా  తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, దీనివల్ల లేబర్ కొరత ఏర్పడవచ్చని ఆర్‌‌బీఐ హెచ్చరించింది.  ‘‘రాష్ట్రంలో పరిశ్రమలు ఉన్నాయి.. పెట్టుబడులు వస్తున్నాయి.. కానీ భవిష్యత్తులో పని చేయడానికి మనుషులు దొరకరు. రాబోయే పదేండ్లలో పనిచేసే వయసున్న పురుషుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి”అని స్పష్టం చేసింది. దీన్ని అధిగమించాలంటే.. ఇప్పటి వరకు ఇండ్లకే పరిమితమైన లేదా తక్కువ వేతనాలకు పనిచేస్తున్న మహిళలను  పారిశ్రామిక రంగాల్లోకి  తీసుకురావడమే మార్గమని సూచించింది.  తెలంగాణలోని మహిళలు ఎక్కువగా వ్యవసాయం, బీడీ తయారీ, చిన్న తరహా పనుల్లోనే ఉన్నారని తెలిపింది. కానీ భవిష్యత్తు అంతా టెక్నాలజీ, మెషినరీదేనని.. అందుకే  వాళ్లకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ  ఇవ్వాలని సూచించింది. కంప్యూటర్ శిక్షణ, మెషినరీ ఆపరేటింగ్, ఎలక్ట్రానిక్స్‌‌లాంటి రంగాల్లో మహిళలకు ట్రైనింగ్ ఇస్తే.. లేబర్ కొరతను ఎదుర్కోవచ్చని పేర్కొంది.  ఫ్యాక్టరీలు, ఐటీ, నిర్మాణ రంగాల్లో పనిచేసే కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉందని, బయట రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలపైనే పూర్తిగా ఆధారపడలేమని, అందుకే స్థానికంగా ఉన్న మహిళా వనరులను వాడుకోవాలంది. 

100  మందిలో 60 మంది మహిళలు దూరంగానే

కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలవారీ ఆర్థిక సాయం లాంటి పథకాలతో సరిపెట్టకుండా.. వారిని పారిశ్రామికవేత్తలుగా, ఉద్యోగులుగా మార్చే విధానాలను రూపొందించాలని ఆర్‌‌‌‌బీఐ సూచించింది. ‘‘మహిళలు ఇంటిని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకునేలా ప్రోత్సహించాలి. ప్రైవేట్ రంగంలోనూ మెరుగైన ప్రసూతి సెలవులు, పిల్లల పెంపకానికి సెలవులు ఇచ్చేలా చట్టాలను కఠినతరం చేయాలి. ఐటీ కంపెనీల నుంచి చిన్న పరిశ్రమల వరకు ప్రతిచోట పిల్లల సంరక్షణ కేంద్రాలు  ఏర్పాటు చేయాలి. అప్పుడే తల్లులు నిశ్చింతగా పనికి రాగలుగుతారు” అని పేర్కొంది.  దేశవ్యాప్తంగా చూస్తే పురుషుల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ దాదాపు 78.8% ఉండగా, మహిళలది కేవలం 41.7% మాత్రమే ఉన్నదని, తెలంగాణలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి అని తెలిపింది.  అంటే పనిచేయగల సామర్థ్యం ఉన్న ప్రతి 100 మంది మహిళల్లో 60 మందికి పైగా ఉపాధి రంగానికి దూరంగా ఉంటున్నారని పేర్కొన్నది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెద్ద నష్టమని,  ఈ అంతరాన్ని పూడ్చడానికి మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకురావడం అత్యవసరమని ఆర్‌‌బీఐ పేర్కొన్నది.

పన్ను పరిధిని విస్తరించాలి 

రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే పన్నుల ఆదాయాన్ని  గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.  కేవలం పన్నుల రేట్లు పెంచడం వల్ల సామాన్యులపై భారం పడుతుంది తప్ప ఆదాయం పెరగదని తెలిపింది. పన్ను పరిధిని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సూచించింది. ‘‘పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో, దానికి తగ్గట్టుగా పన్నుల వసూలు యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవాలి. డేటా అనలిటిక్స్, టెక్నాలజీని ఉపయోగించుకొని జీఎస్టీ, ఇతర  పన్ను ఎగవేతలను అరికట్టాలి. ముఖ్యంగా హైదరాబాద్‌‌లాంటి మహా నగరాల్లో ఆస్తి పన్ను వసూళ్లను మరింత సమర్థవంతంగా చేయాలి. యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయి. అక్కడ పన్ను వసూళ్లకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఖజానాను నింపుకోవాలి. తద్వారా అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూసుకోవాలి’’ అని ఆర్‌‌బీఐ  సూచించింది. మైనింగ్ రంగంలో లీకేజీలను అరికట్టడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చు కోవచ్చని, తద్వారా మద్యం, పెట్రోల్‌‌పై ఆధారపడటం తగ్గించవచ్చని పేర్కొన్నది.

వాటికే ఎక్కువ ఖర్చు

తెలంగాణ ప్రభుత్వం చేసే ఖర్చులో రాబడి వ్యయం అంటే జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలే ఎక్కువగా ఉంటున్నాయని ఆర్బీఐ పేర్కొన్నది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ఆదాయం రాదని, దీనికి బదులుగా మూలధన వ్యయం  అంటే రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక వాడల నిర్మాణంపై పెట్టాలని సూచించింది.  ఆస్తులను సృష్టిస్తే  అవి భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెడతాయని స్పష్టం చేసింది.  తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నప్పటికీ, అది అప్పుల ద్వారా కాకుండా సొంత ఆదాయం ద్వారా జరిగేలా చూసుకోవాలని తెలిపింది. కేంద్రం ఇస్తున్న 50 ఏండ్ల వడ్డీ లేని రుణాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆర్‌‌బీఐ సూచించింది. కాగా, రాష్ట్రంలో తరచూ వస్తున్న వరదలు, రాష్ట్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారబోతున్నాయని ఆర్‌‌బీఐ హెచ్చరించింది. వాతావరణ మార్పులతో పంట నష్టం, ఆస్తి నష్టం జరిగి ప్రభుత్వంపై ఊహించని ఆర్థిక భారం పడుతున్నదని తెలిపింది. దీనిని ఎదుర్కోవడానికి బడ్జెట్‌‌లోనే ప్రత్యేక నిధులు కేటాయించే ‘క్లైమేట్ బడ్జెటింగ్’ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని సూచించింది.